Saturn Transit 2027: శని గోచారం 2027: మేష రాశిలోకి కర్మ ప్రదాత.. ఈ 4 రాశులపై సడే సతి ప్రభావం.. పరిహారాలివే..
పరిహారాలివే..
Saturn Transit 2027: జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడిని కర్మ ప్రదాతగా పరిగణిస్తారు. మానవులు చేసే మంచి, చెడు కర్మల ఆధారంగా ఆయన న్యాయాధికారిలా ఫలితాలను అందిస్తుంటాడు. అందువల్ల గ్రహాల సంచారంలో శని రాశి మార్పుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. 2027 జూన్ 3న శని దేవుడు మీన రాశిని వీడి మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత ఆగస్టు 9, 2027న వక్రగతిలోకి వెళ్లి, అక్టోబర్ 20, 2027న తిరిగి మీన రాశిలోకి చేరుకుంటాడు. ఈ మార్పు 12 రాశులపై ప్రభావం చూపినప్పటికీ.. ముఖ్యంగా కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వారికి ఏలినాటి శని దశల్లో కీలక మార్పులను తీసుకురానుంది. ఈ కాలంలో ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ప్రతికూలతలు తొలగడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో వివరంగా తెలుసుకుందాం.
కుంభ రాశి: చివరి దశలో సంయమనం ముఖ్యం
కుంభ రాశి వారికి ఇది ఏలినాటి శని చివరి దశ. స్వయం రాశ్యాధిపతి శని అయినప్పటికీ, ఈ కాలంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటతీరును అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో అనవసర వాదనలకు దిగకూడదు. ఆర్థిక విషయాల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. ఆరోగ్యపరంగా చిన్నపాటి హెచ్చుతగ్గులు ఉండే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలి. శనివారం నాడు శని దేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పేదలకు అన్నదానం చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.
వృషభ రాశి: మొదలవుతున్న సడే సతి తొలి దశ
2027 జూన్ 3 నుంచి వృషభ రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభం కానుంది. ఇది వీరి సహనానికి గట్టి పరీక్ష పెట్టే సమయం. అనుకోని ఖర్చులు పెరిగి ఆదాయానికి మించి వ్యయాలు ఉండవచ్చు. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగం మారడం, విదేశాలకు వెళ్లడం లేదా పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. శనివారాల్లో నల్ల నువ్వులను దానం చేయడం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయి.
మీన రాశి:
అత్యంత ప్రభావవంతమైన దశ.. అప్రమత్తత అవసరం. మీన రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని రెండో దశ (శిఖర దశ) నడుస్తోంది. ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం, మానసిక ఆందోళన, కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. స్థిరాస్తుల కొనుగోలు లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహాలు తప్పనిసరి. మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
పరిహారం:
రోజూ లేదా ప్రతి శనివారం భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి ఉపశమనం లభిస్తుంది.
మేష రాశి: బాధ్యతలు ఎక్కువ.. శ్రమకు తగిన ఫలితం
శని మేష రాశిలోకి ప్రవేశించడంతో వీరికి ఏలినాటి శని ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. ఎంత కష్టపడినా తక్షణ ఫలితాలు రాకపోవచ్చు, పనులు ఆలస్యం కావచ్చు. మానసిక నిరుత్సాహానికి లోనుకాకుండా నిజాయితీగా కష్టపడితే శని సరైన సమయంలో రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు. ఈ కాలంలో పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడం, రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి.
పరిహారం:
శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, శని గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల కార్యవిఘ్నాలు తొలగిపోతాయి.
శని ప్రభావం అంటే కేవలం కష్టాలు మాత్రమే కాదు; అది మనిషికి కర్తవ్య నిష్ట, ధర్మం, ఓర్పును నేర్పే ఆధ్యాత్మిక పాఠశాల. జాతకంలో శని అనుకూలంగా ఉండి, మన కర్మలు ధర్మబద్ధంగా ఉంటే శని దేవుడు ఊహించని ఉన్నత స్థాయిని, శాశ్వత విజయాలను ప్రసాదిస్తాడు.