Significance of Talambralu: సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల విశిష్టత

తలంబ్రాల విశిష్టత

Update: 2026-03-27 06:58 GMT

Significance of Talambralu: లోక కళ్యాణం కోసం జరిగిన దివ్య వివాహం... సీతారాముల కళ్యాణం. ఈ అద్భుత వేడుకలో భక్తులందరినీ పరవశింపజేసే ఘట్టం 'తలంబ్రాలు'. తలంబ్రాలు అంటే కేవలం బియ్యం కాదు, అవి అక్షతలు. 'క్షతము' లేనివి, అంటే విచ్ఛిన్నం కాని బంధానికి, శాశ్వతమైన అనురాగానికి సంకేతాలు ఈ అక్షతలు.ఈ బియ్యంలో పసుపు, కుంకుమతో పాటు ముత్యాలను కూడా కలుపుతారు. అందుకే వీటిని 'ముత్యాల తలంబ్రాలు' అంటారు.

భద్రాచల క్షేత్రంలో జరిగే ఈ తలంబ్రాల వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ యంత్రాలతో పాలిష్ చేసిన బియ్యాన్ని వాడరు. వేలాది మంది భక్తులు తమ చేతులతో, గోళ్లతో ఎంతో భక్తితో వొలిచిన బియ్యాన్ని 'కోటి తలంబ్రాలు'గా స్వామివారికి సమర్పిస్తారు. రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి ఒకరిపై ఒకరు పోసుకుంటుంటే, ఆ దృశ్యం కనుల పండువగా ఉంటుంది.

ముఖ్యంగా భద్రాద్రి కళ్యాణంలో 'ముత్యాల తలంబ్రాలు' ప్రత్యేక ఆకర్షణ. నాడు భక్త రామదాసు ప్రారంభించిన ఈ సంప్రదాయం ప్రకారం, నేటికీ ప్రభుత్వం తరపున ముత్యాలను సమర్పించడం జరుగుతోంది. సీతమ్మ దోసిట్లోకి రామయ్య ముత్యాలు పోస్తుంటే అవి తెల్లని నవ్వుల్లా మెరిసిపోతుంటాయి. రామయ్య దోసిట్లోకి జానకమ్మ ముత్యాలు పోస్తుంటే అవి ఆనంద బాష్పాల్లా దొర్లిపోతుంటాయి.

తలంబ్రాల వేడుక అంటే ప్రకృతి, పురుషుల కలయిక. సంసార జీవితంలో భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, కష్టసుఖాలలో తోడుండాలని ఈ ఘట్టం మనకు బోధిస్తుంది. ఆ దివ్య తలంబ్రాలను తలపై ధరిస్తే సర్వ పాపాలు తొలగి, శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Tags:    

Similar News