Sri Kodandarama Swamy's annual Brahmotsavam in Ontimitta: శేషవాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత రఘురాముడు
శ్రీ సీతా లక్ష్మణ సమేత రఘురాముడు
Sri Kodandarama Swamy's annual Brahmotsavam in Ontimitta: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు శుక్రవారం రాత్రి శేషవాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ వాహనసేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వి. వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు శ్రీమతి ఎ. ప్రశాంతి, శ్రీ శివప్రసాద్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆదిశేషుడు స్వామివారికి అత్యంత ప్రియ భక్తుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీవైకుంఠంలోని నిత్యసూరుల్లో ఆద్యుడైన ఆదిశేషుడు భూభారాన్ని భరిస్తూ స్వామివారికి సేవ చేస్తున్నాడు. శేషవాహనం దాస్యభక్తికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ భక్తితో జీవిలోని అహంకారం తొలగి మానవత్వం, దైవత్వం వైపు నడిపిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటారు. శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ సమీపంలోని ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం కవి సమ్మేళనం నిర్వహించారు. ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు పోతన మహాభక్తుడని, ఆయన రచించిన భాగవతం భక్తి ప్రవాహంలా ప్రజల్లో విస్తరించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పసుపులేటి శంకర్ “భాగవతం ప్రాచుర్యం”, శ్రీ నారాయణ రెడ్డి “గజేంద్ర మోక్షం”, శ్రీ మల్లికార్జున రెడ్డి “వామన చరిత్ర”, శ్రీమతి దామోదరమ్మ “ప్రహ్లాద చరిత్ర” తదితర అంశాలపై ప్రసంగించి భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.