Sri Lakshmi Narasimha Swamy: తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతి సందర్భంగా ఆమె జన్మస్థలమైన తరిగొండలో స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సాయంత్రం 6 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి దివ్య కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యాహవచనం, కన్యాదానం, కంకణధారణ, మాంగల్యధారణ, మంగళాశాసనం తదితర ఘట్టాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చివరగా నక్షత్రహారతి, మంగళహారతితో కల్యాణం ముగిసింది.

స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో తరిగొండ మారుమోగింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కె. గోపాల బట్టర్, శ్రీ కృష్ణ రాజ బట్టర్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ వేమా వేంకట రత్నం, సూపరింటెండెంట్ శ్రీమతి సుశీల, సీనియర్ అసిస్టెంట్ శ్రీ ఎల్ ఎన్ వి రవికుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: