Hanumantha Vahanam: హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి
శ్రీ మలయప్పస్వామి
Hanumantha Vahanam: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండ రాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుస్సు, బాణం ధరించి, తన పరమభక్తుడైన హనుమంతునిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
వాహనం ముందు భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హనుమంత వాహనం – భగవద్భక్తికి ప్రతీక
భగవద్భక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు శ్రీరామునిపై అచంచలమైన భక్తికి ప్రతీక. చతుర్వేద పండితుడు, అపార పరాక్రమశాలి అయిన ఆంజనేయునిపై శ్రీ మలయప్పస్వామివారు విహరించడం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గురుశిష్యులైన శ్రీరాముడు, హనుమంతుడి దివ్య సంబంధాన్ని ఈ వాహనసేవ స్మరింపజేస్తుంది.
నేడు సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజవాహనం
శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు పుష్పక విమానంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్, శ్రీ శాంతారామ్, శ్రీమతి రంగశ్రీ, శ్రీమతి జానకీ దేవి, శ్రీ సదాశివమ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.