Sri Pattabhirama Swamy: నేటి నుంచి శ్రీ పట్టాభిరామ స్వామివారి పవిత్రోత్సవాలు
పవిత్రోత్సవాలు
Sri Pattabhirama Swamy: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో అక్టోబర్ 24 నుంచి 26వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా 23వ తేదీ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 24న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం; 25న పవిత్ర సమర్పణ; 26న మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్నారు. చివరి రోజు సాయంత్రం స్వామివారి తిరుచ్చి వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల విశిష్టత
ఆలయంలో నిత్యం నిర్వహించే అర్చనలు, ఆర్జిత సేవలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర వైదిక క్రతువుల్లో తెలిసీ తెలియక సంభవించే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అంకురార్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ, విశేష హోమాలు, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. తద్వారా స్వామివారి కృపాకటాక్షాలు భక్తులపై ప్రసరించి, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తారు.
పవిత్రోత్సవాల్లో పాల్గొనదలచిన భక్తులు ఒక్క టికెట్‌కు రూ.300 చెల్లించాలి. ఒక్క టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పిస్తారు. భక్తులు ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని శ్రీ పట్టాభిరామ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.