Sri Venugopala Swamy Charms: చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడిగా భక్తులను మురిపించిన శ్రీ వేణుగోపాలస్వామి
శ్రీ వేణుగోపాలస్వామి
Sri Venugopala Swamy Charms: కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు నవనీత కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.
చంద్రకాంతుల మధ్య వెన్నముద్దను ధరించిన బాలకృష్ణుని రూపంలో స్వామివారు దర్శనమివ్వగా, గోవింద నామస్మరణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోయాయి. స్వామివారి మనోహర రూపాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
ఔషధాలకు, జీవజాతికి పోషకుడైన చంద్రభగవానుడు శాంతి, శీతలత్వం, ఆనందానికి ప్రతీక. చంద్రప్రభ వాహనంపై విహరించే శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల జీవితాల్లో ప్రశాంతత, సౌభాగ్యం, ఆధ్యాత్మిక కాంతిని ప్రసాదిస్తాడనే సందేశాన్ని ఈ వాహనసేవ చాటిచెబుతుంది.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.