Sri Venugopala Swamy: కార్వేటినగరం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామివారి తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 7.30 గంటలకు స్కంధ పుష్కరిణిలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో తెప్పలపై స్వామివారి విహారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వీరస్వామి, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: