Tirumala Pavitrotsavams: పూర్ణాహుతితో తిరుమలలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు
పవిత్రోత్సవాలు
Tirumala Pavitrotsavams: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా మూడురోజులపాటు నిర్వహించబడే పవిత్రోత్సవాలు మంగళవారంనాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
తొలి రెండురోజుల్లాగానే మంగళవారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. తరువాత ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీనితో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.
కాగా మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇక రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.