Srivari Brahmotsavam: గజ వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు
శ్రీ మలయప్ప కనువిందు
Srivari Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
గజ వాహనం – కర్మ విముక్తి
నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.
వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీవారి గజాలు
శ్రీవారి ఆలయ గజాలు మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి, వైష్ణవి నేతృత్వంతో మలయప్ప వాహన సేవల వైభవాన్ని పెంచాయి.
రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి.