Ontimitta Sri Kodandarama Swamy Temple: అద్భుత శిల్ప కళకు నిలయం – ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం
Ontimitta Sri Kodandarama Swamy Temple: కడప జిల్లాలోని పవిత్ర క్షేత్రం ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని శిల్పాలు విజయనగర కాలం శిల్పకళ వైభవాన్ని స్మరింపజేస్తాయి. ముఖ్యంగా రంగమండపంలోని యాళి స్తంభాలు దర్శనార్థులను ఆకట్టుకుంటాయి. భారీ గండశిలలను యాళి స్తంభాలుగా మలచిన తీరు శిల్పుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
రాయల వంశ కాలంలో నిర్మితమైన అనేక ఆలయాలలో యాళి స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒంటిమిట్ట ఆలయంలో ఒక్కో స్తంభం మధ్యలో నిలువుగా ఖాళీ స్థలం ఉండి, అందులో ఒక వ్యక్తి కూర్చోగలిగే విధంగా ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుంది. రంగమండపంలోని స్తంభాలపై పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వాటిలో రెండు స్తంభాలు సంప్రదాయ పేట్రస్ శైలిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడి ఆకర్షణీయంగా నిలుస్తాయి.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చరిత్ర
పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తున్న సమయంలో, సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోకి బాణం సంధించగా అక్కడ నీటి బుగ్గ ఉద్భవించింది. అదే నేటి ఒంటిమిట్టలోని పవిత్ర రామతీర్థంగా భావిస్తారు.
రావణ సంహారం కోసం శ్రీరాముడికి సహకరించిన జాంబవంతుడు సేవించిన శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. ఒకే రాతిపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడినందున ఈ ప్రాంతాన్ని “ఏకశిలా నగరం” అని కూడా పిలుస్తారు.
ఆలయంలోని శాసనాల ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయింది. 1356లో బుక్కరాయలు ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని అనంతరం విజయనగర రాజులు, మట్లి రాజులు అభివృద్ధి చేశారు. అంతరాలయం, రంగమండపం, మహా ప్రాంగణం, గోపురాలు వంటి నిర్మాణాలు ఈ కాలంలో నిర్మితమయ్యాయి.
ఎందరో కవులకు నిలయం ఒంటిమిట్ట
ఒంటిమిట్ట క్షేత్రం ఎన్నో మంది మహాకవులకు ప్రేరణనిచ్చిన పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందింది. మహాకవి శ్రీ పోతన మాత్యులు ఇక్కడే భావగవతాన్ని తెనిగించినట్లు విశ్వసిస్తారు. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట శ్రీ కోదండరామునిపై రఘువీర శతకం రచించి అంకితం చేశారు. రామభద్రకవి రామాభ్యుదయం రచించారు.
నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని అనుగ్రహంతో వరకవిగా ప్రసిద్ధి పొందారు. ఉప్పుగుండూరు వేంకటకవి దశరథరామ శతకం రచించారు. ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణంను రచించారు. తాళ్లపాక అన్నమయ్య శ్రీరాముని మహిమను కీర్తిస్తూ అనేక సంకీర్తనలు ఆలపించారు.
2015 సెప్టెంబర్ 09న టిటిడిలో విలీనం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండగా, 2015 సెప్టెంబర్ 09న టిటిడిలో విలీనం అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 01వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చురుకుగా చేపడుతోంది.
శ్రీ సీతారాముల కల్యాణం వైభవం
ప్రతి ఏడాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ విధానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అర్చకులు భగవత్ ప్రార్థనతో ప్రారంభించి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తదుపరి వస్త్ర సమర్పణ, మధుపర్కం, మహాసంకల్పం, కన్యాదానం జరుగుతాయి. అనంతరం జీలకర్ర–బెల్లం, మాంగల్యపూజ, అక్షతారోపణం, మాలపరివర్తనం వంటి మంగళకార్యాలు నిర్వహించి వేదాశీర్వాదాలతో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా ముగుస్తుంది. కల్యాణం అనంతరం భక్తులకు ముత్యాలతో కూడిన తలంబ్రాలను టీటీడీ అందజేస్తుంది.