Spiritual Merit: తీర్థం తీసుకోవడం వెనుక పరమార్థం ఇదే: ఆధ్యాత్మిక పుణ్యంతో పాటు ఆరోగ్య రహస్యాలు!
ఆధ్యాత్మిక పుణ్యంతో పాటు ఆరోగ్య రహస్యాలు!
Spiritual Merit: హిందూ సంప్రదాయంలో దేవాలయ సందర్శన చేసినా లేదా ఇంట్లో పూజలు నిర్వహించినా చివరగా 'తీర్థం' తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన విధి. అయితే తీర్థం కేవలం భక్తితో తీసుకునేది మాత్రమే కాదు, దాని వెనుక బలమైన ఆధ్యాత్మిక నమ్మకాలు మరియు శాస్త్రీయ ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయని పండితులు వివరిస్తున్నారు.
అకాల మరణం, పాప విముక్తి కోసం:
"అకాల మృత్యు హరణం.. సర్వ వ్యాధి నివారణం.. సమస్త పాప క్షయకరం.. విష్ణు పాదోదకం పుణ్యం" అని పెద్దలు చెబుతుంటారు. తీర్థం సకల పాపాలను హరిస్తుందని, అకాల మరణం కలగకుండా కాపాడుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఏ గుడికి వెళ్లినా తీర్థం తప్పక తీసుకోవడం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుందని, మనసు ప్రశాంతంగా మారుతుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్య ప్రదాయినిగా తీర్థం:
తీర్థం తీసుకోవడం వెనుక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. సాధారణంగా తీర్థాన్ని రాగి లేదా వెండి పాత్రలలో ఉంచుతారు. పూజలో ఉపయోగించే పచ్చకర్పూరం, తులసి దళాలు, ఇలాచి వంటి పదార్థాలు నీటిలో చేరడం వల్ల అది ఔషధ గుణాలను సంతరించుకుంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వివిధ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. మంత్రోక్తమైన దైవ శక్తి కలిగిన ఈ తీర్థాన్ని స్వీకరించడం వల్ల శారీరక, మానసిక ఉత్తేజం లభిస్తుంది.