Tirumala Theertham: పాపాలను పోగొట్టే తిరుమల తీర్థం
తిరుమల తీర్థం
Tirumala Theertham: తిరుమల కొండల్లోని పవిత్ర రామకృష్ణ తీర్థానికి వెళ్లే అద్భుత అవకాశాన్ని TTD కల్పిస్తోంది. ఏడాదికి ఒక్కసారి(మాఘ పౌర్ణమి) మాత్రమే ఇక్కడికి వెళ్లే అనుమతి ఉంటుంది. ఆ పుణ్య ఘడియలు ఈ ఏడాది FEB 1న రాబోతున్నాయి. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్మకం. మహావిష్ణువు రామకృష్ణుడనే సాధువుకు ముక్తినిచ్చిన పుణ్య ప్రదేశమిది.
మాఘ పౌర్ణమి సందర్భంగా FEB 1న తిరుమలలోని రామకృష్ణ తీర్థంలో పుణ్య స్నానం ఆచరిస్తే ‘మాఘ స్నాన’ ఫలం దక్కి, సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మోక్షం లభిస్తుందని సూచిస్తున్నారు. అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే పాపాలను ఈ స్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పుణ్య స్నానం ఆధ్యాత్మిక శుద్ధిని ప్రసాదించి సత్మార్గంలో నడిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
స్కంద పురాణం ప్రకారం.. పూర్వం రామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రి పర్వతాలపై కఠోర తపస్సు చేశారు. నిత్య స్నానాదుల కోసం ఈ తీర్థాన్ని నిర్మించుకున్నారు. అక్కడే నివసిస్తూ మహావిష్ణువును ధ్యానించారు. మహర్షి భక్తికి మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఆయనకు ముక్తిని ప్రసాదించారు. అందుకే ఈ తీర్థానికి ఆయన పేరొచ్చింది. ఈ ప్రదేశంలో రాముడు, కృష్ణుడి విగ్రహాలుంటాయి. అందుకే దీన్ని ‘రామకృష్ణ తీర్థం’ అంటారని మరో గాథ.