Tirumala Tirupati Devasthanams (TTD): బ్యాగు పొగొట్టుకున్న భక్తులకు తిరిగి అప్పగింత
తిరిగి అప్పగింత
Tirumala Tirupati Devasthanams (TTD): తిరుపతి నుండి తిరుమలకు వచ్చే రెండో ఘాట్ రోడ్డులో విలువైన ఆభరణాలు, డబ్బు ఉన్న బ్యాగును భక్తులు పోగొట్టుకోవడంతో టీటీడీ సిబ్బంది భద్రపరిచి, తగిన ఆధారాలను పరిశీలించిన అనంతరం సంబంధిత భక్తులకు యథాతథంగా అప్పగించారు.
శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఘాట్ రోడ్డులో బ్యాగును గుర్తించిన బైకర్, ఉదయం 6.30 గంటలకు జీఎన్సీ టోల్‌గేట్ వద్ద విధుల్లో ఉన్న హోంగార్డు రెడ్డప్పరావుకు అప్పగించారు. అనంతరం ఆ బ్యాగును సీసీటీవీ సిబ్బంది వద్ద భద్రపరిచి, కమాండ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు.
బ్యాగు కోసం వచ్చిన గుంటూరు జిల్లా బ్రాడీపేటకు చెందిన శ్రీమతి సునీత, శ్రీ పోతుల నారాయణ, కుటుంబ సభ్యులు అందించిన వివరాలు, ఆధారాలను పరిశీలించిన అనంతరం బ్యాగును తెరిచి అందులోని వస్తువులన్నీ ఉన్నాయా అని వారి చేత తనిఖీ చేయించారు. అన్ని వస్తువులు సురక్షితంగా ఉన్నాయని భక్తులు నిర్ధారించడంతో, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ సూచనల మేరకు ఏవీఎస్వోలు శ్రీ కృష్ణయ్య, శ్రీ వెంకట శివ కుమార్‌ల సమక్షంలో బ్యాగును వారికి సురక్షితంగా అప్పగించారు.
బ్యాగులో 61 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,02,840 నగదు, సుమారు రూ.10 లక్షల విలువైన భూమి ఒప్పంద పత్రాలు, బట్టలు ఉన్నాయి.
బ్యాగును గుర్తించి బాధ్యతాయుతంగా టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించిన బైకర్‌కు, అలాగే దానిని భద్రపరిచి యథాతథంగా సంబంధిత భక్తులకు అందజేసిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.