Tirumala VIP Break Darshan: అక్టోబర్ 1, 5 తేదీల్లో తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రేక్ దర్శనాలు రద్దు
Tirumala VIP Break Darshan: తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం, అలాగే రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 1వ తేదీ గురువారం, అక్టోబర్ 5వ తేదీ సోమవారం ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది.
ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేలమంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించడం జరుగుతోంది. అయినప్పటికీ అదే రోజు అదనంగా వచ్చి దర్శనానికి నిరీక్షించే దాదాపు 30 వేల మంది భక్తులు తర్వాత రోజు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయం మరింత పెరుగుతోంది. ఈ కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు సంబంధించి ముందు రోజు అనగా సెప్టెంబర్ 30వ తేది బుధవారం, అక్టోబర్ 4వ తేది ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.