Troubled by Nightmares and Anxiety: రాత్రి వేళల్లో చెడు కలలు, ఆందోళన వేధిస్తున్నాయా? మీ బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు దోషాలే కారణం కావచ్చు..
ఈ వాస్తు దోషాలే కారణం కావచ్చు..
Troubled by Nightmares and Anxiety: చాలా మంది రాత్రి పూట నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా భయానక లేదా వింత కలలు వచ్చి ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. ఇవి ఆ క్షణంలో నిద్రను పాడు చేయడమే కాకుండా మరుసటి రోజు రోజంతా మానసిక ఒత్తిడికి, అలసటకు కారణమవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్‌రూమ్‌లో ఉండే కొన్ని రకాల వాస్తు దోషాల వల్లే ఇలాంటి ప్రతికూల శక్తి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పడకగదిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ప్రశాంతమైన, గాఢమైన నిద్రను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పడుకునే దిశ చాలా ముఖ్యం..
వాస్తు ప్రకారం మనం పడుకునేటప్పుడు తల ఏ దిశలో ఉందనేది చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ దక్షిణం లేదా తూర్పు దిశ వైపు తల పెట్టి పడుకోవడం శ్రేయస్కరం. పొరపాటున కూడా ఉత్తర దిశ వైపు తల పెట్టి పడుకోకూడదు. ఉత్తర దిశగా తల పెట్టి పడుకోవడం వల్ల భూమి అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల మెదడుపై ఒత్తిడి పడి, చెడు కలలు రావడం మరియు ఆందోళన పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
మంచం కింద శుభ్రత లోపించడం
చాలా మంది మంచం కింద పాత వస్తువులు, ఇనుప సామాన్లు లేదా చెప్పులు, చీపుర్లు వంటివి పెడుతుంటారు. ఇది చాలా పెద్ద వాస్తు దోషం. మంచం కింద చెత్తాచెదారం ఉంటే అది పడకగదిలో ప్రతికూల శక్తిని పెంచుతుంది. ఇది నిద్రలేమికి, మానసిక అశాంతికి దారితీస్తుంది. కాబట్టి మంచం కింద భాగం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
అద్దం ప్రతిబింబం
బెడ్‌రూమ్‌లో మంచానికి ఎదురుగా అద్దం ఉండటం మరో ప్రధాన వాస్తు దోషం. మనం పడుకున్నప్పుడు మన శరీరం అద్దంలో ప్రతిబింబించకూడదు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాత్రి వేళల్లో తెలియని భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. ఒకవేళ బెడ్‌రూమ్‌లో అద్దాన్ని వేరే చోటుకి మార్చడం సాధ్యం కాకపోతే రాత్రి పడుకునే ముందు దానిపై ఒక క్లాత్ లేదా తెరను కప్పి ఉంచడం మంచిది.
పడకగదిలో భయంకరమైన చిత్రాలు వద్దు
మీ బెడ్‌రూమ్ గోడలపై క్రూర జంతువులు, యుద్ధ సన్నివేశాలు, ఎండిపోయిన లేదా ముండ్ల మొక్కలు మరియు పదునైన ఆయుధాల చిత్రాలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇటువంటి ప్రతికూల చిత్రాలు మీ ఉపచేతన మనస్సును ప్రేరేపించి, రాత్రంతా మనశ్శాంతి లేకుండా చేస్తాయి మరియు భయానక కలలు వచ్చేలా చేస్తాయి.
ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని సులభమైన వాస్తు చిట్కాలు
రాత్రి పడుకునే ముందు పడకగదిలో తేలికపాటి సుగంధ ద్రవ్యాలు లేదా కర్పూరాన్ని వెలిగించడం వల్ల గదిలోని గాలి శుద్ధి అయ్యి, సానుకూల శక్తి పెరుగుతుంది.
పడకగదిలో మరీ ఎక్కువ వెలుతురు ఉండే లైట్లను కాకుండా మనస్సుకు హాయినిచ్చే తక్కువ కాంతి గల నైట్ ల్యాంప్స్‌ను ఉపయోగించాలి.
నిద్రపోయే ముందు కాసేపు ధ్యానం చేయడం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం వల్ల కూడా మానసిక ఒత్తిడి తగ్గి గాఢ నిద్ర పడుతుంది.