Ugadi Tomorrow: రేపే ఉగాది: కొత్త ఏడాదికి శుభారంభం.. వేప-బెల్లం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?

వేప-బెల్లం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?

Update: 2026-03-18 11:00 GMT

Ugadi Tomorrow: భారతీయ సనాతన సంస్కృతిలో నూతన సంవత్సరానికి నాంది పలికే పండుగ ఉగాది. యుగస్య ఆది అంటే ఒక కొత్త యుగానికి, కాలానికి ప్రారంభం అని అర్థం. ప్రకృతి పాత ఆకులను రాల్చి, కొత్త చిగుళ్లతో కళకళలాడే వసంత ఋతువులో, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను జరుపుకుంటాము. జ్యోతిష్యులు ఈ పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యాలను వివరించారు.

సృష్టికి పుట్టినరోజు.. రాముని పట్టాభిషేకం..

పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు ఈ రోజే సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. అందుకే ఇది ఒక కొత్త శకానికి ప్రతీక. అంతేకాకుండా.. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం ఈ ఉగాది రోజే జరిగిందని ప్రతీతి. శ్రీమహావిష్ణువు ధరించిన మత్స్యావతారం కూడా ఈ పవిత్ర దినమే సంభవించింది. శాలివాహన శకం కూడా ఈ రోజు నుండే ప్రారంభమైంది.

అభ్యంగ స్నానం - పూజా విధానం:

పండుగ రోజు ఉదయాన్నే నూనె రాసుకుని అభ్యంగ స్నానం చేయడం ప్రధాన ఆచారం. స్నానం చేసేటప్పుడు సప్త నదుల మంత్రాన్ని పఠించడం వల్ల పవిత్ర నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పండితులు తెలిపారు. అనంతరం కొత్త బట్టలు ధరించి, మామిడి ఆకులతో తోరణాలు కట్టి ఇష్టదైవాన్ని పూజించాలి.

వేప-బెల్లం: జీవిత సత్యానికి ప్రతీక

ఉగాది అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది వేప - బెల్లం. ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, జీవిత పాఠం కూడా.

వేప: జీవితంలో ఎదురయ్యే కష్టాలకు ప్రతీక.

బెల్లం : జీవితంలోని సుఖాలకు ప్రతీక.

వీటిని సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో వచ్చే సుఖదుఃఖాలను స్థితప్రజ్ఞతతో ఎదుర్కోవాలనే సందేశం ఇందులో దాగి ఉంది. వేప పువ్వును స్వీకరించేటప్పుడు ఆరోగ్యం, సర్వ సంపదలు కలగాలని ప్రార్థించాలి.

పంచాంగ శ్రవణం: భవిష్యత్తుపై అవగాహన

ఉగాది రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం చేయడం అత్యంత ముఖ్యం. వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంశాల ద్వారా ఆ సంవత్సరం మన జాతకం మరియు దేశ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవచ్చు. గురూజీ ప్రకారం, రాబోయే సంవత్సరానికి గురుడు రాజుగా, కుజుడు మంత్రిగా చంద్రుడు సేనాపతిగా వ్యవహరించనున్నారు.

ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు, అది మన సంస్కృతికి, ప్రకృతికి మరియు ఆరోగ్యానికి వారధి. ఈ పండుగ అందరి జీవితాల్లో నూతన జీవశక్తిని, సుఖశాంతులను నింపాలని కోరుకుందాం.

Tags:    

Similar News