‘Bhagavan’ Really Mean: మనం నిత్యం పూజించే.. నిరంతరం స్మరించే ఆ 'భగవంతుడు' ఎవరు? అసలు 'భగవాన్' అనే పదానికి ఉన్న అసలైన, లోతైన అర్థం ఏమిటి? మన సనాతన ధర్మంలో, పురాణాలలో ఈ చిన్న పదానికి ఎంతటి పరమార్థం దాగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

భాషా పరంగా చూస్తే.. 'భగవాన్' అనే పదం 'భజ్' అనే సంస్కృత మూల పదం నుండి ఉద్భవించింది. సంస్కృతంలో 'భజ్' అంటే.. 'కలిగి ఉండటం' లేదా 'ఆశ్రయించడం' అని అర్థం. అంటే.. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని తనలో కలిగి ఉండి, ఈ అనంత విశ్వాన్ని తన సంపూర్ణ నియంత్రణలో ఉంచుకునే సర్వోన్నత శక్తినే 'భగవాన్' అంటారు. సరళంగా చెప్పాలంటే.. ఆయనే ఈ సృష్టికి ఏకైక సంపూర్ణ యజమాని.

పండితులు, వేదకోవిదుల పరిశోధనల ప్రకారం.. దీనిని మరో అద్భుతమైన కోణంలో కూడా అర్థం చేసుకోవచ్చు. విష్ణుపురాణం ప్రకారం.. ఎవరిలోనైతే ఆరు రకాల గుణాలు లేదా శక్తులు పరిపూర్ణంగా, గరిష్ట స్థాయిలో ఉంటాయో.. వారిని మాత్రమే 'భగవాన్' అని పిలుస్తారు. ఆ ఆరు ఐశ్వర్యాలు ఏమిటంటే...

మొదటిది: సర్వశక్తి.. అంటే సమస్తాన్ని శాసించగల అనంతమైన బలం.

రెండవది: సర్వజ్ఞానం.. సృష్టిలోని అణువణువు గురించిన పూర్తి ఎరుక.

మూడవది: సర్వ సంపద.. సమస్త ప్రాణులకు జీవనాధారమైన ఐశ్వర్యం.

నాల్గవది: సర్వ కీర్తి.. విశ్వమంతటా వ్యాపించిన యశస్సు.

ఐదవది: సంపూర్ణ వైరాగ్యం.. అన్నీ ఉన్నా దేనికీ బంధీ కానటువంటి అంటీముట్టని తత్వం.

ఆరవది: సంపూర్ణ సృజనాత్మక సామర్థ్యం.. శూన్యం నుండి నూతన సృష్టిని చేయగల అద్భుత శక్తి.

ఈ ఆరు గుణాలు ఒక సాధారణ మనిషిలో కొద్ది మొత్తంలో ఉండవచ్చు. కానీ, ఇవన్నీ ఏ లోటు లేకుండా, పరిపూర్ణంగా ఎవరిలోనైతే ఉంటాయో.. ఆ సర్వోన్నత శక్తినే మనం భగవంతుడిగా భావిస్తాం. ఏ లోటూ లేకుండా అన్నీ ఉన్న ఒక పరిపూర్ణమైన వ్యక్తిని లేదా అంతిమ శక్తిని మీరు ఊహించుకోగలిగితే.. ఆ శక్తినే 'భగవాన్' అని పిలుస్తారు. అందుకే, భగవంతుడిని ఆరాధించడం అంటే.. ఆ పరిపూర్ణత్వాన్ని, ఆ అనంతమైన గుణాలను మన మనస్సులో నింపుకోవడమే.

Tags: