Tulsi Plant Dries Up at Home: ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఏం జరుగుతుంది.? ఎండిన తులసిని ఏం చేయాలి?
ఎండిన తులసిని ఏం చేయాలి?
Tulsi Plant Dries Up at Home: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి మొక్కను.. ప్రతి ఇంట్లోనూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. నిత్యం దీపారాధన చేస్తూ, నీళ్లు పోసి ఆరాధిస్తారు. ఇంట్లో సరైన దిశలో తులసి మొక్క ఉండటం వల్ల.. ఆ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షంతో పాటు శాంతి, సంతోషం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి.
అయితే, కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల లేదా వాతావరణ మార్పుల వల్ల తులసి మొక్క నిద్రపోతుంది.. అంటే ఎండిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు. అది ఇంట్లోని సానుకూల శక్తిని నశింపజేసి, ప్రతికూల శక్తిని అంటే నెగెటివ్ ఎనర్జీని పెంచుతుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అనవసర గొడవలు, మానసిక అశాంతి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలి?
మొదటగా ఎండిపోయిన తులసి మొక్కను కుండీలో నుండి చాలా జాగ్రత్తగా తొలగించాలి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మంగళవారం, శుక్రవారం, అలాగే ఏకాదశి తిథుల్లో తులసి మొక్కను అస్సలు ముట్టుకోకూడదు, కుండీలో నుండి తీయకూడదు. ఈ రోజులు మినహాయించి మిగతా రోజుల్లో జాగ్రత్తగా తీయాలి.
తీసిన ఆ ఎండిన మొక్కను ఎక్కడ పడితే అక్కడ పారేయడం లేదా డస్ట్‌బిన్‌లో వేయడం వంటి తప్పులు అస్సలు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై, జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పవిత్రమైన తులసి కర్రలను ఏదైనా పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో కలపాలి. ఒకవేళ అది వీలు కాకపోతే.. ఇంట్లో లేదా గుడిలో జరిగే హోమాలలో, యజ్ఞాలలో ఆ తులసి కర్రలను సమర్పించవచ్చు.ఆ తర్వాత, ఆ పాత కుండీలో కొత్త మట్టిని వేసి, గురువారం లేదా మరేదైనా శుభ ముహూర్తంలో కొత్త తులసి మొక్కను భక్తితో నాటుకోవాలి.