Kalki Avatar Arrive: కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? విష్ణుపురాణం ఏం చెబుతోంది?

విష్ణుపురాణం ఏం చెబుతోంది?

Update: 2026-05-19 03:22 GMT

Kalki Avatar Arrive: సనాతన ధర్మంలో కాలచక్రం నాలుగు యుగాలుగా తిరుగుతుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం..ప్రస్తుతం మనం జీవిస్తున్న కలియుగం. ఈ కలియుగం అంతిమ దశకు చేరుకున్నప్పుడు, భూమిపై అధర్మం పతాక స్థాయికి చేరినప్పుడు, దుష్టశిక్షణ కోసం, శిష్టరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ఎత్తబోయే పదో అవతారమే... కల్కి అవతారం.కానీ, ఈ కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? దీనిపై పురాణాలు ఏం చెబుతున్నాయి?

విష్ణుపురాణం ,భాగవత పురాణాల ప్రకారం... కలియుగం మొత్తం కాలప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల (4,32,000) సంవత్సరాలు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ప్రారంభమైన ఈ కలియుగంలో ఇప్పటివరకు కేవలం ఐదు వేల వందల యాభై (5,150) సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే, కలియుగం ముగిసి, కల్కి అవతారం రావడానికి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల (4,26,000) సంవత్సరాలకు పైగా సమయం ఉంది.

పురాణాల ప్రకారం, కలియుగం ముగిసే సమయానికి మానవుల ఆయుష్షు, బుద్ధి, సత్యం పూర్తిగా క్షీణిస్తాయి. సమాజంలో ధర్మం అనేది అంతరించిపోతుంది. ఆ కటిక చీకటి రోజుల్లో... 'శంబల' అనే పుణ్యగ్రామంలో, 'విష్ణుయశస్సు' అనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి భగవానుడు జన్మిస్తాడు.

ఆయన 'దేవదత్తం' అనే తెల్లటి గుర్రంపై, చేతిలో మెరుస్తున్న ఖడ్గంతో విశ్వవ్యాప్తంగా ఉన్న దుష్టులను, అధర్మాన్ని నశింపజేస్తాడు. కల్కి అవతారంతో ఈ కలియుగానికి ముగింపు పడుతుంది. ఆ వెంటనే భూమిపై మళ్లీ ధర్మం వర్ధిల్లే 'సత్యయుగం' లేదా 'కృతయుగం' పునఃప్రారంభమవుతుంది.

కాబట్టి, సోషల్ మీడియాలో లేదా బయట ప్రచారంలో ఉన్నట్లు కల్కి అవతారం ఇప్పుడే రాబోవడం లేదు. దానికి ఇంకా లక్షల సంవత్సరాల సమయం ఉంది.

Tags:    

Similar News