Ashtami and Navami: అష్టమి, నవమి తిథుల్లో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? పురాణాలు చెబుతున్న అసలు కారణాలు ఇవే..
పురాణాలు చెబుతున్న అసలు కారణాలు ఇవే..
Ashtami and Navami: హిందూ సాంప్రదాయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలన్నా, పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేయాలన్నా మంచి ముహూర్తం కోసం తిథి, నక్షత్రాలను చూసుకోవడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే పంచాంగంలో ఎన్ని మంచి రోజులు ఉన్నా.. అష్టమి, నవమి తిథులు వస్తే మాత్రం ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించకుండా పక్కన పెడుతుంటారు. "అష్టమి, నవమి రోజుల్లో ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి కావు.. సాగుతూనే ఉంటాయి" అనే నమ్మకం జనాల్లో బలంగా ఉంది. మరి దేవుళ్లు జన్మించిన ఈ పవిత్రమైన తిథులను శుభకార్యాలకు ఎందుకు దూరం పెట్టారో పురాణాల ప్రకారం తెలుసుకుందాం.
భగవంతుడే కష్టాలు పడ్డాడా?
ఈ రెండు తిథుల్లో మానవాళిని రక్షించడానికి సాక్షాత్తూ ఆ మహావిష్ణువే రెండు గొప్ప అవతారాలు ఎత్తాడు. కానీ ఆ అవతారాల జీవిత విశేషాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి..
అష్టమి : శ్రావణ బహుళ అష్టమి రోజన శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ అష్టమి తిథి నాడే ఆయన పుట్టినప్పటికీ.. కృష్ణుడు పుట్టినప్పటి నుండి జీవితాంతం ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. కంసుడి కారాగారంలో పుట్టడం, పుట్టగానే కన్నవారికి దూరం కావడం, నిరంతరం రాక్షసులతో పోరాడటం వంటి అనేక ఇబ్బందులను ఆయన ఎదుర్కొన్నాడు.
నవమి : చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు. రాముడికి పట్టాభిషేకం జరగాల్సిన సమయంలోనే ఆయన నారచీరలు కట్టుకుని 14 ఏళ్లు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు, సీతాదేవిని విడిచి ఆయన పడిన శోకం, చేసిన యుద్ధం వర్ణనాతీతం.
దైవ స్వరూపులైన వారే ఈ తిథులలో జన్మించి లౌకిక జీవితంలో అనేక పోరాటాలు, కష్టాలు అనుభవించడం వల్ల.. ఈ రోజుల్లో సాధారణ మానవులు లౌకికపరమైన శుభకార్యాలు ప్రారంభిస్తే ఆ పనుల్లో ఆటంకాలు లేదా లాగింగ్ ఉంటాయని పెద్దలు ఈ తిథులను నిరసించారు.
ఆధ్యాత్మిక సాధనకు అత్యంత శ్రేష్ఠం:
లౌకిక పనులకు అష్టమి, నవమి తిథులు అనుకూలం కాకపోయినప్పటికీ, దైవిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇవి అత్యంత శక్తివంతమైన రోజులు.
పూజలు - మంత్ర సాధన:
ఈ రోజుల్లో దేవుడిని ఆరాధించడం, మంత్రాలు జపించడం, హోమాలు చేయడం, దీక్షలు స్వీకరించడం వంటి వాటికి ఇవి చాలా పవిత్రమైనవి.
ఉగ్ర దేవతల ఆరాధన:
అష్టమి రోజున కాలభైరవుడిని, దుర్గాదేవిని పూజించడం వల్ల జాతకంలోని రాహు-కేతు దోషాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే శత్రువులపై విజయం సాధించడానికి, కోర్టు కేసుల వ్యవహారాలకు ఈ రోజులు అనుకూలంగా పరిగణించబడతాయి.