Mustard Oil Offered to Lord Shani: హిందూ సంప్రదాయంలో శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మ ఫలదాతగా భావిస్తారు. వ్యక్తులు చేసే మంచి, చెడు కర్మలను బట్టి ఆయన ఫలితాలను అందిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావం, ఏలినాటి శని (సాడే సతి), శని దోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి శని దేవునికి ఆవనూనె సమర్పించడం అత్యంత శక్తివంతమైన పరిహారంగా చెబుతారు. అయితే ఆయనకు ఆవనూనెనే ఎందుకు నైవేద్యంగా సమర్పిస్తారో తెలిపే ఆసక్తికరమైన పౌరాణిక గాథ, జ్యోతిష్య విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

హనుమంతుడు – శని దేవుడి పౌరాణిక గాథ

పురాణాల ప్రకారం, లంకాధిపతి రావణుడు తన అహంకారంతో నవగ్రహాలనూ బంధించాడు. ఆ సమయంలో శని దేవుడు రావణుడి దుష్కార్యాలకు తగిన శిక్ష తప్పదని హెచ్చరించడంతో, ఆగ్రహించిన రావణుడు శని దేవుడిని బంధించి తలక్రిందులుగా వేలాడదీశాడు. సీతాన్వేషణలో భాగంగా లంకకు వచ్చిన హనుమంతుడు, లంకా దహనం చేస్తూ శని దేవుడిని ఆ బంధనాల నుంచి విడిపించాడు. చాలా కాలం తలక్రిందులుగా వేలాడడం వల్ల శని దేవుడు తీవ్రమైన శారీరక నొప్పులతో బాధపడ్డాడు. ఆయన బాధను గమనించిన హనుమంతుడు, శని దేవుడి శరీరమంతటా ఆవనూనెతో మర్దన చేసి ఉపశమనం కలిగించాడు. హనుమంతుడి సేవకు ప్రసన్నుడైన శని దేవుడు.. ఎవరైతే తనకు భక్తితో ఆవనూనె సమర్పిస్తారో, వారి కష్టాలను, బాధలను తొలగిస్తానని వరమిచ్చాడు. అప్పటి నుంచే శని దేవుడికి ఆవనూనె సమర్పించే సంప్రదాయం ఆచరణలోకి వచ్చింది.

జ్యోతిష్య శాస్త్రంలో ఆవనూనె ప్రాముఖ్యత

కష్టాల నుంచి ఉపశమనం: శని దేవుడు జీవితంలో వచ్చే పోరాటాలు, ఆలస్యాలు, కఠిన సవాళ్లకు ప్రతీక. కర్మ సంబంధిత ఒత్తిళ్లు, శారీరక-మానసిక బాధల నుంచి ఉపశమనం పొందడానికి భక్తులు ఆవనూనెతో తైలాభిషేకం లేదా దీపారాధన చేస్తారు.

గ్రహ శక్తుల సమతుల్యత: శని స్వభావరీత్యా చీకటి, చల్లదనం, మందకొడితనానికి సూచిక. మరోవైపు ఆవనూనెకు వెచ్చదనం, స్థిరత్వం కలిగించే గుణాలు ఉన్నాయి. శని దేవునికి ఆవనూనెను సమర్పించడం వల్ల ఆయనలోని కఠినమైన, శీతల శక్తి సమతుల్యమై, గ్రహ ప్రతికూల ప్రభావాలు శాంతిస్తాయని నమ్ముతారు. శనివారం నాడు శని దేవుడికి లేదా హనుమంతుడికి ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల శని దోషాల తీవ్రత తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం.

Tags: