Sweep the House in the Evening: సాయంత్రం పూట ఇల్లు ఎందుకు ఊడ్చకూడదు? చీపురును ఇంట్లో ఎక్కడ పెట్టాలి.?

చీపురును ఇంట్లో ఎక్కడ పెట్టాలి.?

Update: 2026-06-30 07:57 GMT

Sweep the House in the Evening: జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఇల్లంతా ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షంతో, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం వాస్తు శాస్త్రంలో కొన్ని అత్యంత ముఖ్యమైన నియమాలను చెప్పారు. మన ఇంట్లో మనం చేసే కొన్ని చిన్న చిన్న పనుల వల్లే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.. అదే సమయంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ తల్లికి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందులోనూ ముఖ్యంగా, ప్రతిరోజూ ఇల్లు ఊడ్చే 'చీపురు' విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

హిందూ సంప్రదాయంలో చీపురును కేవలం చెత్త ఊడ్చే వస్తువుగా చూడరు. దానిని సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే చీపురును పొరపాటున కూడా కాళ్లతో తన్నడం గానీ, దాటడం గానీ చేయకూడదు. దానికి అగౌరవం కలిగిస్తే జీవితంలో ఆర్థిక కష్టాలు మొదలవుతాయని నమ్ముతారు.

చాలామంది ఆఫీసుల నుంచి సాయంత్రం రాగానే లేదా రాత్రి పూట ఇల్లు దుమ్ముగా ఉందని ఊడుస్తుంటారు. కానీ వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవడం అస్సలు మంచిది కాదు. సాయంత్రం వేళ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం. ఆ టైమ్‌లో ఇల్లు ఊడ్చడం వల్ల ఇంట్లో ఉండే సానుకూల శక్తి బయటకు పోయి, దరిద్రం లోపలికి వస్తుంది. ఒకవేళ రాత్రి పూట ఏదైనా పడి కచ్చితంగా ఊడవాల్సి వస్తే.. ఆ చెత్తను రాత్రే బయట పారేయకుండా, ఒక మూలన పెట్టి మరుసటి రోజు ఉదయం మాత్రమే బయట పడవేయాలి.

ఇక చీపురును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచడం కూడా పెద్ద వాస్తు దోషం. లక్ష్మీదేవి స్వరూపమైన చీపురును ఇంట్లోకి వచ్చే ఎవరికీ కనిపించకుండా, దాచి ఉంచాలి. మన ఇంట్లో డబ్బులు దాచే బీరువాను ఎలాగైతే రహస్యంగా ఉంచుతామో.. చీపురును కూడా అలాగే ఉంచాలి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో కానీ, డైనింగ్ టేబుల్ దగ్గర కానీ చీపురును అస్సలు పెట్టకూడదు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగి, అనారోగ్య సమస్యలు వస్తాయి.

అలాగే, చీపురును ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు. చీపురును నిలబెట్టి ఉంచితే ఇంట్లో అప్పుల బాధలు పెరుగుతాయి. కాబట్టి ఎల్లప్పుడూ చీపురును పడుకోబెట్టి మాత్రమే ఉంచాలి. పాతబడిపోయిన లేదా విరిగిపోయిన చీపురును వాడటం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే విరిగిన చీపురును వెంటనే మార్చేయాలి. అయితే, కొత్త చీపురును కొనేటప్పుడు కూడా శనివారం లేదా అమావాస్య రోజుల్లో కొంటే చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతుంటారు.

ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లలో కొద్దిగా కల్లు ఉప్పు (రాక్ సాల్ట్) వేసి తుడవడం వల్ల ఇంట్లోని నకారాత్మక శక్తి తొలగిపోయి, లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది. చూశారుగా.. రోజూ మనం వాడే చీపురు విషయంలో ఈ చిన్న చిన్న వాస్తు నియమాలు పాటిస్తే, మీ ఇంట్లో ధన నష్టం కలగకుండా ఎల్లప్పుడూ సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

Tags:    

Similar News