Seriously Harm Your Spine: ఆధునిక జీవనశైలిలో చిన్న అలవాట్లే పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు వాడటం, ఒకేచోట కదలకుండా కూర్చోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వెన్నెముక తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా మెడ నొప్పి, నడుము నొప్పి, కండరాల బిగువు వంటి సమస్యలు సాధారణమైపోయాయి. వీటిని ఆరంభంలోనే గుర్తించకపోతే దీర్ఘకాలిక సమస్యలుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెన్నెముకను దెబ్బతీసే ఆ 3 ప్రధాన అలవాట్లు, వాటికి నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు..

తల కిందకు వంచి మొబైల్ వాడటం

నేటి కాలంలో సోషల్ మీడియా, చాటింగ్‌ల కోసం స్మార్ట్‌ఫోన్‌లను విరివిగా వాడుతున్నారు. అయితే స్క్రీన్ చూస్తున్నప్పుడు తలను కిందకు వంచడం వల్ల మెడ కండరాలు, నరాలపై విపరీతమైన భారం పడుతుంది. ఇది క్రమంగా మెడ నొప్పి, తీవ్రమైన అలసటకు దారితీస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్త:

మొబైల్‌ను ఎల్లప్పుడూ కంటి స్థాయికి సమాంతరంగా పట్టుకోవాలి. మెడను ఎక్కువగా వంచకుండా నిటారుగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఎక్కువ సమయం ఫోన్ వాడాల్సి వస్తే మధ్యమధ్యలో చిన్న విరామం తీసుకుంటూ మెడ, భుజాలను నెమ్మదిగా స్ట్రెచ్ చేయండి.

కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం

కార్యాలయాల్లో పనిచేసేవారు, కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఎక్కువ గంటలు గడిపేవారు కూర్చునే భంగిమ పై దృష్టి పెట్టకపోవడం సర్వసాధారణం. నడుము వంచి కూర్చోవడం, వెనుక భాగానికి సరైన ఆధారం లేకపోవడం వల్ల నడుము కండరాలు బిగుసుకుపోయి నొప్పులు మొదలవుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్త:

కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు నేలపై చదునుగా ఆనేలా చూసుకోవాలి. కంప్యూటర్ స్క్రీన్ నేరుగా కంటి చూపు పరిధిలోనే ఉండేలా సర్దుబాటు చేసుకోవాలి. ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి అటూఇటూ కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలి.

సరైన భంగిమలో నిద్రపోకపోవడం

నిద్రించే సమయంలో శరీరానికి, ముఖ్యంగా మెడ, వెన్నెముకకు సరైన ఆధారం దక్కకపోతే ఒంటి నొప్పులు మొదలవుతాయి. మెడను ఒకే పక్కకు మెలిపెట్టి పడుకోవడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్త

పక్కకు తిరిగి పడుకునేవారు తల, వెన్నెముక ఒకే సరళరేఖలో ఉండేలా సరైన ఎత్తు ఉన్న దిండును వాడాలి. రెండు మోకాళ్ల మధ్య చిన్న దిండు పెట్టుకుంటే వెన్నెముక సహజమైన స్థితిలో ఉంటుంది. వెల్లకిలా పడుకునేవారు మోకాళ్ల కింద చిన్న దిండును ఉంచుకుంటే నడుముపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.

వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకునే చిట్కాలు.

క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం వల్ల వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుందని అపోలో అడ్లక్స్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ షిబు పేర్కొంటున్నారు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

నడుము నొప్పి చాలా రోజులుగా తగ్గకుండా వేధిస్తున్నా, కాళ్లు లేదా చేతుల్లో అకస్మాత్తుగా బలహీనత కనిపించినా, నడకలో తడబాటు వచ్చినా లేదా మూత్ర, మల విసర్జనపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. చిన్న చిన్న జాగ్రత్తలే వెన్నెముకను దీర్ఘకాలం పదిలంగా ఉంచుతాయి.

Tags: