Immune System: శరీరాన్ని అంటువ్యాధులు, రోగాల నుంచి కాపాడటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. బ్యాక్టీరియా, వైరస్, ఇతర హానికర వ్యాధికారకాలతో రోగనిరోధక శక్తి పోరాడుతుంది. వాటి నుంచి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ వ్యవస్థ బలహీనపడినప్పుడు శరీరానికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పెరుగుతుంది. వైద్య నివేదికల ప్రకారం రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు వైరస్‌ల బారినపడే అవకాశాలు ఎక్కువ. కొన్ని రోజువారీ అలవాట్లు ఈ వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నాలుగు అలవాట్లు ఇవి.

రాత్రి సమయాల్లో తగినంత నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. 2019లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం, రోగనిరోధక కణాల సాధారణ పనితీరుకు ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. శరీరంలో నిద్రలో ఉన్నప్పుడు సైటోకిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఈ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతిరోజూ సరిపడా నిద్రపోవడం అవసరం.

ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్స్, చక్కెర అధికంగా ఉండే పదార్థాలకు స్వస్తి చెప్పడం మంచిది. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవచ్చు. శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అవసరం. అవి లేని ఆహారం ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే పండ్లు, కూరగాయలు లాంటి పోషకాలున్న ఆహారాన్ని తినాలి. రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు, పచ్చి కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి.

రోజంతా కూర్చోవడం కూడా హానికరమే. అసలు వ్యాయామం చేయకపోయినా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం క్రమం తప్పని శారీరక శ్రమ రోగనిరోధక కణాలను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే నడవడం, యోగా చేయడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వండి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది.

అధికంగా మద్యం సేవించడం రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మద్యపానం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరానికి లోపిస్తుంది. అదేవిధంగా సిగరెట్లు, పొగాకు వినియోగం కూడా ఈ వ్యవస్థను బలహీన పరుస్తుంది. వీటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం శ్రేయస్కరం. మద్యం, ధూమపానం రెండూ రోగనిరోధక కణాలను దెబ్బతీస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలపరచుకోవచ్చు. నిద్ర, ఆహారం, వ్యాయామం, ధూమపానం-మద్యపానం వంటి అలవాట్లను సరిచేసుకుంటే శరీరం సహజంగా బలంగా మారుతుంది. ఈ నాలుగు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: