Liver Detox: మానవ శరీరంలో కాలేయం ఒక సహజ ఫిల్టర్ లాంటిది. మనం తీసుకునే ఆహారం, నీటిలోని పోషకాలను వేరుచేస్తూ, విషపదార్థాలను బయటకు పంపడంలో ఇది రాత్రింబగళ్లు శ్రమిస్తుంది. అయితే ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్, నూనెలు-జంక్ ఫుడ్స్ అధికంగా ఉండే ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్ వంటి కారణాల వల్ల కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది. క్రమంగా అది ఫ్యాటీ లివర్ లేదా ఇతర వ్యాధులకు దారితీస్తుంది. కాలేయాన్ని ఎప్పటికప్పుడు సహజసిద్ధంగా డీటాక్స్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడే 5 అద్భుతమైన పానీయాలు ఇక్కడ చూద్దాం..

గ్రీన్ టీ

గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంచదార లేకుండా ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం మంచిది.

బీట్‌రూట్ జ్యూస్

బీట్‌రూట్‌లో బీటాలైన్స్, నైట్రేట్లు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇది కాలేయంలో పైత్యరసం ఉత్పత్తిని వేగవంతం చేసి, రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది. తాజా బీట్‌రూట్‌తో పాటు కొద్దిగా అల్లం లేదా నిమ్మరసం కలిపి వారానికి మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవచ్చు.

పసుపు - గోరువెచ్చని నీరు

పసుపులోని కుర్కుమిన్ అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మూలకం. ఇది కాలేయ కణాల వాపును తగ్గించడంతో పాటు దెబ్బతిన్న కణాలను వేగంగా పునరుద్ధరించడానికి సహకరిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఆర్గానిక్ పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగాలి.

నిమ్మరసం - పుదీనా వాటర్

నిమ్మకాయలో విటమిన్-సి అత్యధిక మోతాదులో ఉంటుంది. శరీరంలో గ్లూటాథియోన్ అనే సహజ యాంటీఆక్సిడెంట్ ఉత్పత్తిని పెంచి, కాలేయం నుండి టాక్సిన్లను సులభంగా బయటకు పంపుతుంది. ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మరసం, కొన్ని పుదీనా ఆకులు వేసి రోజులో ఎప్పుడైనా తాగవచ్చు.

క్యారెట్ - అల్లం జ్యూస్

క్యారెట్‌లోని బీటా-కెరోటిన్, అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాలేయానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ ముక్కలు, చిన్న అల్లం ముక్కను బ్లెండ్ చేసి తాజా రసాన్ని వడపోసి తాగాలి.

Tags: