Before a Disease Worsens: రోగం ముదరకముందే శరీరం ఇచ్చే 7 హెచ్చరికలు ఇవే.. తేలికగా తీసుకుంటే ముప్పే..
తేలికగా తీసుకుంటే ముప్పే..
Before a Disease Worsens: ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య ఒక్కసారిగా రాదు. శరీరంలో ఏదైనా వ్యాధి మొదలయ్యే ముందు శరీరం అనేక చిన్న చిన్న సంకేతాల ద్వారా హెచ్చరిస్తూనే ఉంటుంది. చాలామంది పని ఒత్తిడి లేదా అజాగ్రత్త వల్ల వీటిని సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ ప్రారంభ మార్పులను సకాలంలో గుర్తించి వైద్యులను సంప్రదిస్తే ప్రాణాంతక సమస్యలను కూడా ముందే అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరం ఇచ్చే 7 కీలక ముందస్తు హెచ్చరికలు ఇక్కడ చూద్దాం..
కారణం లేని నిరంతర అలసట
తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకున్నప్పటికీ రోజంతా విపరీతమైన నీరసం, శక్తి లేకపోవడం వంటివి రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు లేదా గుండె జబ్బుల ప్రారంభ సంకేతం కావొచ్చు.
ఆకస్మిక బరువు మార్పులు
ఎలాంటి డైటింగ్ లేదా వ్యాయామం చేయకుండానే శరీరం బరువు ఒక్కసారిగా తగ్గడం లేదా ఊహించని విధంగా పెరగడం మంచిది కాదు. ఇది మధుమేహం, జీవక్రియ సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యతకు సూచన.
చర్మం, గోళ్ల రంగులో మార్పులు
చర్మం లేదా కళ్లు పసుపు రంగులోకి మారడం కాలేయ సమస్యలను సూచిస్తుంది. అలాగే గోళ్లు పెళుసుబారడం, పాలిపోవడం లేదా వాటిపై గీతలు పడటం శరీరంలో ఐరన్, విటమిన్ల లోపానికి సంకేతం.
దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు
తరచూ గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం లేదా ఎక్కువ రోజుల పాటు మలబద్ధకం, విరేచనాలు వేధిస్తుంటే అది కేవలం ఆహార లోపం మాత్రమే కాదు. పేగుల ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణకోశ వ్యాధుల ప్రారంభ దశ కావచ్చు.
పుండ్లు, గాయాలు త్వరగా మానకపోవడం
చిన్న దెబ్బలు లేదా పుండ్లు పడినప్పుడు సాధారణ సమయం కంటే ఎక్కువ రోజులు మానకపోవడం, పదే పదే చర్మ ఇన్ఫెక్షన్లు రావడం రక్తంలో అధిక చక్కెర స్థాయిలకు ప్రధాన లక్షణం.
నిరంతర తలనొప్పి - చూపు మసకబారడం
మాటిమాటికీ తీవ్రమైన తలనొప్పి రావడం, కళ్ల ముందు మసకగా కనిపించడం లేదా తల తిరగడం వంటివి అధిక రక్తపోటు, నాడీ సంబంధిత సమస్యలు లేదా మైగ్రేన్‌కు సంకేతాలు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
కొద్దిపాటి నడక లేదా సాధారణ పనులకే ఆయాసం రావడం, గుండె దడ పెరగడం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు లేదా గుండె పనితీరు మందగించడాన్ని సూచిస్తుంది.