Teeth with Ultra-Thin Veneers: నవ్వుకు మెరుపు: అల్ట్రా-థిన్ వినీర్స్‌తో ఆకర్షణీయ పళ్లు
| ఆకర్షణీయ పళ్లు
Teeth with Ultra-Thin Veneers: ముఖానికి అందం తెచ్చే నవ్వు.. అది మెరిసే పళ్లతో మాత్రమే పూర్తి అవుతుంది. పళ్లు విరిగినా, మరకలు పడినా, వంకరగా ఉన్నా, సందులు ఉన్నా, క్షీణించినా నవ్వే ధైర్యం తగ్గుతుంది. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు సులభమైన, సహజంగా కనిపించే పరిష్కారం వినీర్స్. ఇవి పంటి ముందు భాగానికి అతికించే పలుచని కృత్రిమ పొరలు. సెలబ్రిటీలకే కాదు, సాధారణ వారికీ ఇవి దంత సమస్యలను పరిష్కరిస్తున్నాయి.
వినీర్స్ అంటే పళ్ల ఆకారం, రంగు, సైజుకు అనుగుణంగా తయారుచేసిన సన్నని షెల్స్. అల్ట్రా-థిన్ సెరామిక్ లామినేట్ వినీర్స్ కేవలం 0.3 నుంచి 0.5 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటాయి. కాంతిని ప్రతిఫలింపజేసి సహజ దంతాల్లా మెరుస్తాయి. రంగు, ఆకారం, పొడవు, వెడల్పు అన్నీ మెరుగుపడతాయి. సహజ ఎనామిల్‌ను పెద్దగా కోయాల్సిన అవసరం లేదు. అందరికీ అవసరం లేదు. మిగిలిన ఎనామిల్, కొరికే తీరు, స్థలం, దెబ్బ తీవ్రతను బట్టి వైద్యుడు నిర్ణయిస్తారు.
వీటితో లోతైన మరకలు (ఫ్లోరోసిస్, మందులు, వయసు వల్ల), ముందు పళ్ల మధ్య సందులు, కోరపళ్లు సరిగా ఎదగనివి, పొట్టి పళ్లు, వంకరలు, క్షీణించిన అంచులు, కొద్దిగా విరిగిన పళ్లు, పాత ఫిల్లింగుల మచ్చలు, వివిధ సైజు పళ్లు సరిచేయవచ్చు. తెల్లబడే చికిత్సలు పనిచేయని లోతైన మరకలకు ఇవి ఉత్తమం. 3డీ డిజిటల్ ప్లానింగ్, నోటి స్కానర్లు, క్యాడ్/క్యామ్ సాంకేతికతతో ముందే నవ్వు ఎలా ఉంటుందో చూపించి సరిచేస్తారు. అప్పుడు సిరామిక్‌తో తయారుచేసి అతికిస్తారు.
అమర్చే విధానం సులభం. వినీర్‌ను జిగురుతో అతికించి ప్రత్యేక కాంతితో గట్టిపడేలా చేసి పాలిష్ చేస్తారు. అల్ట్రా-థిన్ రకాల్లో ఎనామిల్‌ను వీలైనంత తక్కువగా తీస్తారు. అందువల్ల సెన్సిటివిటీ తగ్గుతుంది. 40-50 ఏళ్లు దాటినవారికి ఇవి ఎంతో ఉపయోగకరం. వయసుతో పళ్లు పసుపు రంగు, పొట్టిగా, అసమానంగా అవుతాయి. వినీర్స్‌తో మళ్లీ యువత్వం తిరిగొస్తుంది.
పోర్సిలైన్ (సెరామిక్) వినీర్స్ 10-15 సంవత్సరాలు లేదా అంతకు మించి ఉంటాయి. స్టెయిన్ రెసిస్టెంట్. కాంపోజిట్ వినీర్స్ ఒక్క సారి విజిట్‌లో చేయవచ్చు, చవకగా ఉంటాయి కానీ జీవితకాలం తక్కువ. హైదరాబాద్‌లో పోర్సిలైన్ రూ.18 వేల నుంచి, కాంపోజిట్ రూ.5 వేల నుంచి ఒక్క పన్నుకు అంచనా. సరైన పరిశుభ్రత, నైట్ గార్డ్ (గ్రైండింగ్ ఉంటే), గట్టి వస్తువులు కొరకకపోవడం వల్ల ఎక్కువ కాలం నిలుస్తాయి. వైటనింగ్‌తో రంగు మాత్రమే మారుతుంది; వినీర్స్‌తో ఆకారం, సైజు, రంగు అన్నీ ఒకేసారి సరిపోతాయి.
అన్ని సమస్యలకూ వినీర్స్ ఒక్కటే పరిష్కారం కాదు. పట్టీలు, క్రౌన్స్, వైటనింగ్ కూడా అవసరమవచ్చు. ఆరోగ్యకరమైన పళ్లు, చిగుళ్లు ఉన్నవారికే సరిపోతాయి. డాక్టర్‌తో సంప్రదించి 3డీ సిమ్యులేషన్ చూసి నిర్ణయం తీసుకోండి. సరైన సంరక్షణతో మీ నవ్వు ఎప్పటికీ తళతళ మెరుస్తుంది.