Persistent Cough and Breathlessness: దగ్గు, ఆయాసం వృద్ధాప్య లక్షణాలేనా? సీవోపీడీ (COPD) కావొచ్చు.. ఊపిరితిత్తులు దెబ్బతినకముందే అప్రమత్తం
| ఊపిరితిత్తులు దెబ్బతినకముందే అప్రమత్తం
Persistent Cough and Breathlessness: నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడటం, విడవకుండా దగ్గు వేధించడం వంటి వాటిని తరచూ వృద్ధాప్య లక్షణాలుగా తీసి పారేస్తుంటారు. కొందరు శరీర సామర్థ్యం లోపించడం, కాలాల వారీ శ్వాసకోశ సమస్యలుగా భావిస్తుంటారు. అయితే ఇవి తగ్గకుండా కొనసాగుతూ వస్తున్నా, తీవ్రమవుతున్నా క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ (సీవోపీడీ) సంకేతాలు కావొచ్చని అనుమానించాలి.
ఇది దీర్ఘకాల ఊపిరితిత్తుల జబ్బు. చడీ చప్పుడు లేకుండా లోలోపలే ముదురుతూ వస్తుంటుంది. లక్షణాలు నెమ్మదిగా మొదలవుతూ వస్తుండటం వల్ల గుర్తించేసరికే చాలామందిలో ఊపిరితిత్తులు గణనీయంగా దెబ్బతిని పోవడం గమనార్హం. సమయానికి ఊపిరితిత్తి సామర్థ్య పరీక్ష చేయడం, తగు చికిత్స తీసుకోవడం, జీవనశైలి మార్పులతో లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు.
సీవోపీడీ, ఆస్థమా వేర్వేరు. సాధారణంగా ఆస్థమా చిన్నప్పుడే మొదలవుతుంది. కాలాల వారీగా ఉద్ధృతమవుతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతలే కాదు.. ముక్కు దిబ్బడ, కళ్లలోంచి నీరు, దురద, చర్మం మీద దద్దు వంటి అలర్జీ లక్షణాలూ ఉంటాయి. సీవోపీడీ చాలావరకూ పొగ తాగేవారికి, పెద్దవారికి వస్తుంది. మగవారిలో ఎక్కువ. దీనికి కాలాలతో నిమిత్తం లేదు. ఒకసారి మొదలైతే నిరంతరం కొనసాగుతుంది. లక్షణాల తీవ్రత పెరగటమే గానీ తగ్గటమనేది ఉండదు. పిల్లికూతలు, అలర్జీ లక్షణాలేవీ ఉండవు.
సీవోపీడీకి మూలం ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు, గాలిగదులు దెబ్బతినటం. దీంతో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. సీవోపీడీ రెండు రకాలు. ఒకటి క్రానిక్ బ్రాంకైటిస్. ఇందులో గాలిగొట్టాల్లో వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్) తలెత్తటం వల్ల అవి ఉబ్బి, లోపలి మార్గం సన్నబడుతుంది. కఫం ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. రెండోది ఎంఫిసీమా. ఇందులో గాలిగొట్టాలతో పాటు గాలిగదులూ దెబ్బతింటాయి. కొన్ని గదులు చిట్లిపోవచ్చు. కొందరికి రెండు మూడు గదులు కలిసిపోవచ్చు.దీంతో లోపలికి వెళ్లిన గాలి బయటకు రాలేక చిక్కుకుపోతుంది. అప్పుడు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది.
చాలామందికి క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫిసీమా రెండూ కలిసి ఉంటాయి. కొందరికి ఒకటే ఉండొచ్చు. దీని ప్రధాన లక్షణం ఎడతెరపి లేని దగ్గు. ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువ. దగ్గుతో పాటు కఫం పడొచ్చు, పడకపోవచ్చు. రాను రాను ఆయాసం మొదలవుతుంది. మొదట్లో కాస్త కష్టమైన పనులు చేసినప్పుడు, ఆ తర్వాత మెట్లు ఎక్కడం వంటి అలవాటులేని పనులు చేసినప్పుడు శ్వాస కష్టంగా అనిపిస్తుంది. అనంతరం చిన్న చిన్న పనులు, రోజువారీ పనులు చేస్తున్నా.. చివరికి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడూ ఆయాసం రావొచ్చు.
సీవోపీడీ పూర్తిగా నయం కాకపోవచ్చు గానీ లక్షణాలు అదుపులో ఉండటానికి మంచి మందులు ఉన్నాయి. తీవ్రత, ఆయా వ్యక్తుల పరిస్థితిని బట్టి డాక్టర్లు గాలిగొట్టాలను విప్పార్చే బ్రాంకోడైలేటర్లు, కఫం ఉత్పత్తిని తగ్గించే మస్కరినిక్ ఏజెంట్స్ సూచిస్తారు. వీటిని ఇన్హేలర్ల రూపంలో రోజుకు ఒకసారి తీసుకుంటే చాలు. రక్తంలో ఆక్సిజన్ తగ్గితే ముక్కు ద్వారా ఆక్సిజన్ పీల్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని జాగ్రత్తలూ పాటించాలి.
పొగ తాగే అలవాటుంటే మానేయ్యాలి. ఇతరులు కాల్చే సిగరెట్ల పొగను పీల్చకుండానూ చూసుకోవాలి. దుమ్ము, పొగ, ఇంటా బయటా వాయు కాలుష్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చురుకుగా ఉండాలి. డాక్టర్లు సూచించిన మేరకు వ్యాయామం చేయాలి. ఇన్హేలర్లు క్రమం తప్పకుండా వాడుకోవాలి. వీటిని సరిగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఫ్లూ, న్యుమోనియా, కోవిడ్ టీకాల వంటివి సమయానికి తీసుకోవాలి. తరచూ డాక్టర్ను సంప్రదిస్తూ, పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకోవాలి.
విడవని దగ్గు, ఆయాసం, తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అసాధారణ అలసట, రోజువారీ పనులు చేసుకోలేకపోవడం వంటివి ఇబ్బంది పెడుతుంటే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తి సామర్థ్య పరీక్ష (స్పైరోమెట్రీ) ద్వారా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు, జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు. పొగతాగడం మానేయడం, కాలుష్యం నుంచి రక్షించుకోవడం, టీకాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా ఇన్హేలర్లు వాడటం ద్వారా సీవోపీడీ నిర్వహణ సాధ్యమవుతుంది.