Are Baby Walkers Safe for Children: పిల్లలను బేబీ వాకర్‌తో నడిపిస్తే ప్రమాదమా.?

బేబీ వాకర్‌తో నడిపిస్తే ప్రమాదమా.?

Update: 2026-04-03 02:25 GMT

Are Baby Walkers Safe for Children: చిన్నారి బుడిబుడి అడుగులతో ఇల్లంతా తిరుగుతుంటే చూడాలని ఏ తల్లిదండ్రులకైనా ముచ్చటగా ఉంటుంది. ఆ ముచ్చట తీర్చుకోవడానికి, బిడ్డ త్వరగా నడవడం నేర్చుకోవాలని చాలామంది తల్లిదండ్రులు చేసే మొదటి పని.. మార్కెట్ నుండి ఒక 'బేబీ వాకర్' తీసుకురావడం. రంగురంగుల లైట్లు, మ్యూజిక్ ఉండే ఆ వాకర్‌లో బిడ్డను కూర్చోబెడితే చాలు.. ఇక తాము పని చేసుకోవచ్చని, బిడ్డ కూడా సురక్షితంగా ఉంటుందని భావిస్తారు. కానీ, మీరు గమనించని చేదు నిజం ఒకటి ఉంది. మీరు ప్రేమతో కొనిచ్చిన ఆ వాకరే, మీ బిడ్డ సహజ ఎదుగుదలకు శత్రువుగా మారుతోంది.

నిపుణుల పరిశోధనల ప్రకారం.. బేబీ వాకర్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ.మొదటిది.. వెన్నెముక సమస్య. చిన్న వయసులో పిల్లల ఎముకలు చాలా మృదువుగా, రబ్బరులా ఉంటాయి. వారు తమంతట తానుగా నిలబడకముందే, వాకర్‌లో కూర్చోబెట్టి బలవంతంగా నడిపించడం వల్ల వారి వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల వెన్నెముక వంకరగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రెండవది.. నడక తీరు. వాకర్‌లో ఉండే పిల్లలు సాధారణంగా తమ కాలి వేళ్లపై (Toes) బలం వేసి నడుస్తారు. దీనివల్ల వారి మడమలు , కాలి కండరాలు సరిగ్గా అభివృద్ధి చెందవు. ఇది భవిష్యత్తులో వారి నడక తీరును అస్తవ్యస్తం చేస్తుంది.

నడక అనేది కేవలం కాళ్లకు సంబంధించిన విషయం కాదు.. అది మెదడు ,మరియు శరీర సమతుల్యత (Balance)కు సంబంధించిన ప్రక్రియ. బిడ్డ నేలపై బోర్లా పడటం, పాకడం, దేనినైనా పట్టుకుని లేవడానికి ప్రయత్నించడం వల్ల వారిలో 'మోటార్ స్కిల్స్' పెరుగుతాయి. కానీ వాకర్‌లో ఉన్నప్పుడు, ఆ యంత్రమే బిడ్డను ముందుకు నెడుతుంది. దీనివల్ల బిడ్డ తన సొంత బ్యాలెన్స్‌ను కోల్పోతాడు. వాకర్‌లో నడిచిన పిల్లలు, అది లేనప్పుడు త్వరగా కింద పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా, వాకర్స్ వల్ల పిల్లలు మెట్లు దిగడం లేదా వంటగదిలోని ప్రమాదకర వస్తువుల దగ్గరకు వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువే.

తల్లిదండ్రులారా.. ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పులను ఎవరూ వేగవంతం చేయలేరు. మీ బిడ్డ తనంతట తానుగా అడుగు వేసే వరకు ఓపిక పట్టండి. నేలపై వారిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి. వాకర్స్ అనే కృత్రిమ పరికరాల కంటే, మీ చేతిని అందించి ఇచ్చే ధైర్యమే వారిని వేగంగా, ఆరోగ్యంగా నడిపిస్తుంది. గుర్తుంచుకోండి.. వేగవంతమైన నడక కంటే, ఆరోగ్యకరమైన నడకే ముఖ్యం.మీ చిన్నారిని సహజంగా నడవనివ్వండి. వాకర్స్‌కు వీలైనంత దూరంగా ఉంచి, వారి ఎదుగుదల ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి.

Tags:    

Similar News