Ignoring Migraine in Women: మహిళల్లో మైగ్రేన్ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారా? అది దేనికి దారితీస్తుందో తెలుసా..?
అది దేనికి దారితీస్తుందో తెలుసా..?
Ignoring Migraine in Women: తలనొప్పి కదా అని తేలికగా తీసుకునే మైగ్రేన్, భవిష్యత్తులో మిమ్మల్ని ప్రాణాంతకమైన రక్తపోటు బాధితులుగా మార్చవచ్చు. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే మైగ్రేన్లకు, అధిక రక్తపోటుకు దగ్గరి సంబంధం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మైగ్రేన్ - బిపి మధ్య ఉన్న లింక్ ఏంటి?
మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి మాత్రమే కాదు, అది ఒక నాడీ సంబంధిత సమస్య. మైగ్రేన్ వచ్చినప్పుడు శరీరంలోని రక్త నాళాలు అకస్మాత్తుగా కుంచించుకుపోయి, మళ్ళీ వ్యాకోచిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల రక్తపోటులో ఒక్కసారిగా హెచ్చుతగ్గులు వస్తాయి.
హార్మోన్ల ప్రభావం: మహిళల్లో ఋతుస్రావం, గర్భధారణ, రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల మైగ్రేన్లు ఎక్కువగా వస్తాయి. ఇవి దీర్ఘకాలంలో రక్తపోటును శాశ్వతంగా పెంచే అవకాశం ఉంది.
ఒత్తిడి హార్మోన్లు: తరచుగా వచ్చే తలనొప్పి వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, నిద్రలేమికి దారితీస్తాయి. ఇది హై బిపికి ప్రధాన కారణం అవుతుంది.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
కింది లక్షణాలు ఉన్న మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు:
జీవనశైలి:
ఊబకాయం, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసేవార, క్రమరహిత నిద్ర ఉన్నవారు.
అలవాట్లు: ధూమపానం చేసేవారు లేదా కాఫీ, టీ అతిగా తాగే మహిళలకు ఈ ముప్పు ఎక్కువ.
వంశపారంపర్యం:
కుటుంబంలో ఎవరికైనా రక్తపోటు లేదా గుండె జబ్బుల చరిత్ర ఉంటే, వారికి మైగ్రేన్ వల్ల వచ్చే రిస్క్ రెట్టింపు అవుతుంది.
పెయిన్ కిల్లర్లతో జాగ్రత్త..
తలనొప్పి రాగానే మనం వేసుకునే కొన్ని రకాల నొప్పి నివారణ మందులు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినప్పటికీ, అవి రక్తపోటును పెంచే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకూడదని డాక్టర్ సుభాష్ గిరి హెచ్చరిస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తలు: ఈ అలవాట్లు మార్చుకోండి..
మైగ్రేన్, బిపి సమస్యల నుండి బయటపడటానికి ఈ చిన్న సూత్రాలు పాటించండి:
నిద్ర: ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర అవసరం.
ఆహారం: ఉప్పు, కెఫిన్ వినియోగాన్ని బాగా తగ్గించండి. పుష్కలంగా నీరు త్రాగండి.
వ్యాయామం: ప్రతిరోజూ యోగా, ధ్యానం లేదా కనీసం 30 నిమిషాల నడకను అలవాటు చేసుకోండి.
రెగ్యులర్ చెకప్: మైగ్రేన్ ఉన్నవారు తమ రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.
మైగ్రేన్‌ను కేవలం నొప్పితో ముడిపెట్టకుండా, దానిని గుండె ఆరోగ్యానికి ఒక హెచ్చరికగా భావించి సకాలంలో చికిత్స తీసుకోవడం ఉత్తమం.