Protect Yourself from Stroke: జాగ్రత్త.. అది పక్షవాతం బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇలా..
మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇలా..
Protect Yourself from Stroke: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో అధిక రక్తపోటు సమస్య సర్వసాధారణమైపోయింది. అయితే దీనిని చాలా మంది సాదాసీదా ఆరోగ్య సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, రక్తపోటు నియంత్రణ తప్పితే అది నేరుగా పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే హైబీపీని వైద్య పరిభాషలో సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు.
ఏ స్థాయి ప్రమాదకరం?
సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడి రక్తపోటు120/80 mmHg ఉండాలి. ఒకవేళ మీ బీపీ నిరంతరం 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, దానిని హైపర్ టెన్షన్ గా పరిగణించాలి. ఈ స్థాయిలో బీపీ ఎక్కువ కాలం కొనసాగితే పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
బీపీ వల్ల పక్షవాతం ఎలా వస్తుంది?
వైద్యుల విశ్లేషణ ప్రకారం.. అధిక రక్తపోటు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే సూక్ష్మ నరాలను దెబ్బతీస్తుంది.
నరాల అడ్డంకి: రక్తనాళాలు గట్టిపడటం వల్ల మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయి, ఆక్సిజన్ అందక పక్షవాతం సంభవిస్తుంది.
నరాలు చిట్లిపోవడం: తీవ్రమైన ఒత్తిడి వల్ల మెదడులోని నరాలు చిట్లిపోయి బ్రెయిన్ హెమరేజ్‌కు దారితీయవచ్చు. ఇది ప్రాణాంతక పరిస్థితి.
గమనించాల్సిన లక్షణాలు:
ప్రారంభ దశలో హైబీపీ లక్షణాలు బయటపడవు, కానీ సమస్య తీవ్రమైనప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి..
తల వెనుక భాగంలో తరచుగా నొప్పి రావడం.
తల తిరగడం లేదా కళ్లు తిరగడం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.
కారణం లేకుండా విపరీతమైన అలసట చెందడం.
నియంత్రణ మార్గాలు - నిపుణుల సూచనలు:
రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి మందులతో పాటు జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి..
ఉప్పు తగ్గించండి: ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.
వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా యోగా వంటి వ్యాయామాలు చేయాలి.
నిద్ర - ఒత్తిడి: రోజుకు కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి.
రెగ్యులర్ చెకప్: 30 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా బీపీని తనిఖీ చేయించుకోవడం ద్వారా ముప్పును ముందే గుర్తించవచ్చు.