Blood in Urine: మూత్రంలో రక్తం కనిపిస్తోందా? కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Update: 2026-04-03 11:20 GMT

Blood in Urine: కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి మూత్రంలో రక్తం రావడం అనేది అత్యంత ఆందోళన కలిగించే విషయం. దీనిని వైద్య పరిభాషలో హెమటూరియా అని పిలుస్తారు. మన మూత్రపిండాల్లోని రాళ్లు శరీరం నుండి బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడు, అవి మూత్ర నాళం గుండా ప్రయాణిస్తాయి. రాయి కదిలే క్రమంలో నాళం యొక్క గోడలకు రాపిడి జరుగుతుంది. దీనివల్ల అక్కడ చిన్నపాటి గాయాలు ఏర్పడి, మూత్రం ద్వారా రక్తం బయటకు వస్తుంది.

ముఖ్యంగా 5 మిల్లీమీటర్ల కంటే చిన్నగా ఉన్న రాళ్లు మందుల ద్వారా బయటకు వెళ్లేటప్పుడు ఇలా జరగడం సాధారణమేనని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రమాద గంటికలు.. ఎప్పుడు భయపడాలి?

అయితే, ప్రతిసారీ దీనిని సాధారణ విషయంగా కొట్టిపారేయకూడదు. ఈ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలి..

తరచుగా రక్తం పడటం: రక్తం ఒక్కసారి వచ్చి ఆగకుండా పదే పదే వస్తుంటే.

అదనపు లక్షణాలు: రక్తంతో పాటు తీవ్రమైన నడుము నొప్పి, జ్వరం, వణుకు లేదా మూత్రం పోసేటప్పుడు మంట ఉండటం.

ఇన్ఫెక్షన్ సంకేతం: ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు లేదా ఇతర తీవ్రమైన అంతర్గత సమస్యలకు సంకేతం కావచ్చు.

చికిత్స - నిర్ధారణ

అన్ని రకాల రాళ్లు మూత్రం ద్వారానే బయటకు వెళ్తాయని అనుకోవడం తప్పు. రాయి పరిమాణం పెద్దగా ఉన్నా లేదా అది కీలకమైన చోట ఇరుక్కుపోయినా పరిస్థితి విషమిస్తుంది.

పరీక్షలు: పరిస్థితిని అంచనా వేయడానికి డాక్టర్లు మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు.

సర్జరీ: రాయి పెద్దగా ఉంటే శస్త్రచికిత్స లేదా లేజర్ వంటి ఆధునిక వైద్య ప్రక్రియల ద్వారా దానిని తొలగించాల్సి ఉంటుంది.

మూత్రంలో రక్తం పడటం అనేది ఒక్కోసారి చిన్న విషయమే కావచ్చు, కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే నిపుణులైన నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.

Tags:    

Similar News