Breastfeeding Benefits: తల్లి పాలు ఇవ్వడం బిడ్డకే కాదు.. తల్లికి కూడా బోలెడు లాభాలు..

తల్లికి కూడా బోలెడు లాభాలు..

Update: 2026-08-01 13:01 GMT

Breastfeeding Benefits: తల్లి పాలు బిడ్డ పెరుగుదలకు, ఆరోగ్యానికి ఎంత శ్రేష్ఠమైనవో అందరికీ తెలిసిందే. అయితే తల్లి పాలు ఇవ్వడం వల్ల కేవలం పసికందుకే కాకుండా పాలు ఇచ్చే తల్లికి కూడా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తల్లి పాల విశిష్టతపై అవగాహన పెంచుతున్న ఈ తరుణంలో తల్లి పాలు ఇవ్వడం వల్ల వచ్చే లాభాలు, సమాజంలో ఉన్న కొన్ని అపోహలు-నిజాలను తెలుసుకుందాం.

తల్లులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు..

త్వరిత ఉపశమనం: కాన్పు తర్వాత గర్భాశయం మళ్లీ సాధారణ పరిమాణానికి రావడానికి తల్లి పాలు ఇవ్వడం బాగా తోడ్పడుతుంది. అలాగే ప్రసవానంతర రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది:*

తల్లి పాలు ఇచ్చే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.

బరువు తగ్గడంలో సహాయం:

గర్భధారణ సమయంలో పెరిగిన బరువును సహజంగా, వేగంగా తగ్గించుకోవడానికి బ్రెస్ట్ ఫీడింగ్ సహాయపడుతుంది.

మానసిక అనుబంధం:

బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు తల్లి శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు ఒత్తిడిని తగ్గించి, తల్లి-బిడ్డల మధ్య బలమైన ప్రేమానుబంధాన్ని పెంచుతాయి.

తల్లి పాలపై అపోహలు - నిజాలు :

అపోహ 1: స్థన్యం పరిమాణం చిన్నగా ఉంటే పాలు సరిపోవు.

నిజం: రొమ్ము పరిమాణానికి, పాలు ఉత్పత్తి అవ్వడానికి ఎలాంటి సంబంధం లేదు. శరీరంలో హార్మోన్ల సమతుల్యత, బిడ్డ పాలు తాగే విధానం పైనే పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది.

అపోహ 2: డబ్బా పాలు తల్లి పాలకంటే ఎక్కువ పోషకాలను ఇస్తుంది.

నిజం: తల్లి పాలలో ఉండే రోగనిరోధక శక్తులు పోషకాలు ఎలాంటి డబ్బా పాలలోనూ లభించవు. మొదటి 6 నెలలు బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం అత్యంత సురక్షితం.

అపోహ 3: ఎక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు తింటేనే పాలు బాగా పడతాయి.

నిజం: సమతుల్య, పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం. అంతే తప్ప కేవలం కొవ్వు పదార్థాల వల్లే పాలు పెరుగుతాయనుకోవడం పొరపాటు.

నిపుణుల సూచన..

బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల పాటు ఎలాంటి నీళ్లు లేదా ఇతర పదార్థాలు ఇవ్వకుండా ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అందించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా తల్లికి కూడా దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణను ఇస్తుంది.

Tags:    

Similar News