Burning or Pain While Urinating in Women: మూత్రవిసర్జనలో విపరీతమైన మంట, నొప్పి, లేదా తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి సమస్యలు చాలామంది మహిళలను వేధిస్తుంటాయి. అయితే ఎక్కువమంది దీనిని సాధారణ సమస్యగానే భావించి నిర్లక్ష్యం చేయడమో, లేదా డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా మందులు, ఇంటి చిట్కాలను ఆశ్రయించడమో చేస్తుంటారు. కానీ ఈ అలవాటు మూత్రాశయ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని సీనియర్ యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీలోని వీఎన్ఏ హాస్పిటల్ యూరాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వినీత్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల్లో మూత్రవిసర్జన సమయంలో మంట కలగడానికి కేవలం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మాత్రమే కారణం కాదు. శరీరంలో తలెత్తే మరికొన్ని తీవ్రమైన అంతర్గత సమస్యల వల్ల కూడా ఇలా జరగవచ్చు.

మంట వెనుక దాగున్న ప్రధాన కారణాలు

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: మహిళల్లో మంటకు అత్యంత సాధారణ కారణం. దీంతో పాటు పొత్తికడుపులో నొప్పి, మూత్రంలో దుర్వాసన, తరచుగా అర్జెంట్‌గా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటాయి.

నీరు తక్కువగా తాగడం: శరీరంలో తగినంత నీరు లేకపోతే మూత్రం చిక్కబడి, ఆమ్లత్వం పెరిగి తీవ్రమైన మంట వస్తుంది.

యోని ఇన్ఫెక్షన్లు: ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ వాగినోసిస్ వల్ల మంటతో పాటు దురద, అసాధారణ తెల్లబట్ట లేదా దుర్వాసనతో కూడిన స్రావాలు వెలువడతాయి.

ఇంటిమేట్ వాష్‌లు, సువాసన సబ్బులు: సున్నితమైన భాగాలను శుభ్రం చేయడానికి వాడే సువాసన సబ్బులు, స్ప్రేలు, రసాయన ఉత్పత్తులు చర్మానికి చికాకు కలిగించి మంటకు దారితీస్తాయి.

కిడ్నీ లేదా బ్లాడర్ రాళ్లు: మూత్రాశయం లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో మంటతో పాటు భరించలేని నడుము నొప్పి, మూత్రంలో రక్తం పడే అవకాశం ఉంది.

మెనోపాజ్ మార్పులు: మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల మూత్రనాళ కణజాలాలు పొడిబారి సున్నితంగా మారతాయి.

ఎస్టీఐలు: కొన్ని రకాల సుఖవ్యాధులు కూడా మూత్రవిసర్జనలో తీవ్రమైన మంటను కలిగిస్తాయి.

ఆహారపు అలవాట్లు - శృంగారం: అతిగా మసాలాలు ఉన్న ఆహారం, కెఫిన్, అలాగే శృంగారం తర్వాత మూత్రనాళంలో చికాకు వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు.

ఉపశమనం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు - ఇంటి చిట్కాలు

నీరు పుష్కలంగా తాగాలి: రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల బ్యాక్టీరియా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. తాజా క్రాన్‌బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా మూత్రాశయ గోడలకు అంటుకోకుండా నిరోధించవచ్చు.

ప్రోబయోటిక్స్ చేర్చుకోండి: రోజూ పెరుగు లేదా ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.

హీటింగ్ ప్యాడ్: పొత్తికడుపు కింది భాగంలో వెచ్చని హీటింగ్ ప్యాడ్ ఉంచితే కండరాల ఒత్తిడి, నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.

వ్యక్తిగత పరిశుభ్రత: వాష్‌రూమ్ వెళ్లిన తర్వాత ముందు నుండి వెనుకకు మాత్రమే తుడుచుకోవాలి. దీనివల్ల మలద్వారం వద్ద ఉండే బ్యాక్టీరియా మూత్రనాళానికి చేరకుండా ఉంటుంది.

సరైన దుస్తులు: బిగుతుగా ఉండే సింథటిక్ దుస్తులకు బదులుగా వదులైన కాటన్ లోదుస్తులను మాత్రమే వాడాలి.

వీటికి దూరంగా ఉండండి: అతిగా టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, కారంగా ఉండే వేపుళ్లకు దూరంగా ఉండటం మంచిది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

ఇంటి చిట్కాలు కేవలం తాత్కాలిక ఉపశమనం లేదా నివారణకు మాత్రమే తోడ్పడతాయి కానీ, అసలైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా రాళ్లను నయం చేయలేవు. వీటికి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు లేదా యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిందే.

కింది లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే యూరాలజిస్ట్‌ను కలవాలి:

మూత్రంలో రక్తం పడటం

చలితో కూడిన అధిక జ్వరం

తీవ్రమైన నడుము నొప్పి లేదా వాంతులు

గర్భిణీలు, షుగర్ ఉన్నవారిలో మంట కనిపించినప్పుడు

Tags: