Increasing Fiber Intake Cause Bloating: బరువు తగ్గాలన్నా, జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నా డైట్‌లో ఫైబర్ (పీచు పదార్థం) ఉండాల్సిందే. అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పి.. ఒక్కసారిగా ఫైబర్ మోతాదును పెంచేస్తే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఫైబర్ తీసుకునేటప్పుడు నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెప్పిన ఆ 5 పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి పొరపాటు.. ఫైబర్‌ను ఒక్కసారిగా భారీగా పెంచడం. శరీరం అలవాటు పడకముందే ఒకేసారి ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల గట్ మైక్రోబయోమ్ ఓవర్‌హెడ్ అయి గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది. దీన్ని నివారించడానికి నెమ్మదిగా, క్రమంగా ఫైబర్ శాతాన్ని పెంచుకోవాలి. ఇక రెండవది.. అన్ని ఫైబర్‌ను ఒకే పూటలో డంప్ చేయడం. రోజంతా తీసుకోవాల్సిన పీచు పదార్థాన్ని కేవలం ఒక్కసారే తినడం వల్ల జీర్ణశ్రియపై తీవ్రమైన భారం పడుతుంది. అందుకే భోజనానికి, అల్పాహారానికి మధ్య ఫైబర్‌ను సమానంగా విభజించుకోవాలి.

మూడవ ముఖ్యమైన తప్పు.. తగినంత నీరు త్రాగకపోవడం. ఫైబర్ సరిగ్గా జీర్ణమై పేగుల్లో సాఫీగా కదలాలంటే నీరు అత్యంత ముఖ్యం. తగినన్ని నీళ్లు తాగకపోతే ఫైబర్ కాస్తా మలబద్ధకం, కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.

అలాగే నాలుగోది.. కేవలం సప్లిమెంట్లపైనే ఆధారపడటం. సహజ సిద్ధమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల ద్వారా అందాల్సిన ఫైబర్‌ను వదిలేసి కేవలం పౌడర్లు లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం పెరుగుతుంది.

ఐదవది.. వ్యాయామానికి ముందు లేదా రాత్రి నిద్రపోయే ముందు హెవీ ఫైబర్ తీసుకోవడం. పడుకునే ముందు పీచు పదార్థాలు ఎక్కువగా తింటే జీర్ణక్రియ మందగించి రాత్రంతా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కాబట్టి ఫైబర్‌ను సమతుల్యంగా, తగినన్ని నీళ్లతో తీసుకుంటూ.. శరీరం చెప్పే సంకేతాలను అర్థం చేసుకుంటే ఎలాంటి జీర్ణ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: