People with High Cholesterol and Heart Problems Drink Milk: పాలు సమతుల్య ఆహారంలో కీలక భాగం. వీటిలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు పాలు తాగడం సురక్షితమేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. పాలలో ఉండే సంతృప్త కొవ్వు రక్తంలో లిపిడ్ ప్రొఫైల్‌పై ప్రభావం చూపుతుంది కాబట్టి, ఎలాంటి పాలు ఎంచుకోవాలనే విషయంలో స్పష్టత అవసరం.

గుండె ఆరోగ్యంపై పాల ప్రభావం ఏమిటి?

పాలలో సహజంగానే శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, ముఖ్యంగా మీగడతో కూడిన ఫుల్-క్రీమ్ పాలలో దీని శాతం ఎక్కువ. అధికంగా శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ , నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనల ప్రకారం, ఫుల్-క్రీమ్ పాలలోని డైటరీ కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. అందుకే గుండె సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఫుల్-క్రీమ్ పాలకు దూరంగా ఉండాలని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు. అయితే, పాలను పూర్తిగా మానేయాల్సిన పనిలేదు; ఎంపిక చేసుకునే పాల రకంపైనే అంతా ఆధారపడి ఉంటుంది.

ఫుల్-క్రీమ్ పాలకు ప్రత్యామ్నాయం ఏది?

కొలెస్ట్రాల్ బాధితులకు టోన్డ్, డబుల్ టోన్డ్ లేదా స్కిమ్డ్ పాలు అత్యుత్తమ ఎంపిక.

కొవ్వు శాతం తక్కువ: వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా స్వల్పంగా లేదా దాదాపు శూన్యంగా ఉంటుంది.

పోషకాలు పదిలం: కొవ్వు తగ్గించినప్పటికీ, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం వంటి అవసరమైన పోషకాలు శరీరానికి అందుతాయి.

పరిశోధనల మద్దతు: ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' పరిశోధనల ప్రకారం, స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడానికి సహకరిస్తుంది.

రోజుకు ఎంత పరిమాణంలో పాలు తాగవచ్చు?

ఆస్ట్రేలియన్ హార్ట్ ఫౌండేషన్ మార్గదర్శకాల ప్రకారం, కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్ సమస్యలు ఉన్నవారు రోజుకు 2 నుంచి 4 కప్పుల తక్కువ కొవ్వు గల పాలు తీసుకోవచ్చు. అయితే ఈ పరిమాణం అందరికీ ఒకేలా వర్తించదు. వ్యక్తి వయస్సు, రోజువారీ కేలరీల అవసరం, ఇతర డైరీ ఉత్పత్తుల వాడకం మరియు గుండె ఆరోగ్యాన్ని బట్టి ఇది మారుతుంది. ఇప్పటికే తీవ్రమైన గుండె సమస్యలు లేదా అధిక LDL ఉన్నవారు తమ ఆహారంలో పాల పరిమాణాన్ని ఖరారు చేసుకునేందుకు వైద్యులు లేదా న్యూట్రిషనిస్టుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Tags: