Sweating Reduce Fever: జ్వరం వచ్చిందా? అయితే ఒంటికి మందపాటి దుప్పటి చుట్టుకుని, గది కిటికీలు మూసేసి... బాగా చెమట పట్టేలా చేయి! అప్పుడే జ్వరం త్వరగా తగ్గుతుంది!"పెద్దల నుంచి మనం తరచుగా వినే సలహా ఇదే. జ్వరం తగ్గాలంటే శరీరంలో ఉన్న చెమట అంతా బయటకు పోవాలని చాలా మంది నమ్ముతుంటారు. కానీ, ఇది నిజమేనా? ఇలా చెమట పట్టించడం ద్వారా నిజంగానే జ్వరం తగ్గిపోతుందా?

ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనంటున్నారు డాక్టర్లు. కావాలని శరీరాన్ని వేడెక్కించడం, ఎక్కువ దుప్పట్లు కప్పుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోదు. జ్వరం అనేది అసలు రోగం కాదు... అది మన శరీరంలో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని రోగ నిరోధక వ్యవస్థ ఇస్తున్న సంకేతం మాత్రమే. జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అదనపు దుప్పట్లు వేసుకోవడం వల్ల జ్వరం తగ్గకపోగా, శరీరంలో నీటి శాతం తగ్గిపోయే (Dehydration) ప్రమాదం ఉంది.

కొన్నిసార్లు జ్వరం తగ్గేటప్పుడు వాటంతట అవే చెమటలు పట్టవచ్చు. శరీరం తన సాధారణ ఉష్ణోగ్రతను కోల్పోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే అలా చెమట వస్తుంది. అంతేకానీ, బలవంతంగా చెమట పుట్టించడం వల్ల ఇన్ఫెక్షన్ బయటకుపోదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

మరి జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి?

శరీరానికి సరిపడా విశ్రాంతి ఇవ్వాలి. గోరువెచ్చని నీళ్లు, జ్యూస్‌ల రూపంలో తగినంత ద్రవాహారాన్ని తీసుకోవాలి. గదిని సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతలో ఉంచుతూ, తేలికైన వస్త్రాలను ధరించాలి. జ్వరం ఎక్కువగా ఉంటే వైద్యుల సూచన మేరకు తగిన మందులు వాడాలి. అంతేగానీ, ఎవరైనా దుప్పట్లు కప్పుకుని చెమట పట్టించమని చెబితే మాత్రం ఆ సాహసం చేయకండి! శరీరాన్ని సహజంగా కోలుకోనివ్వండి, తగినంత హైడ్రేటెడ్ గా ఉండండి.

Tags: