Causes of Postpartum Depression: డెలివరీ తర్వాత డిఫ్రెషన్ కు కారణాలివే..
డిఫ్రెషన్ కు కారణాలివే..
Causes of Postpartum Depression: ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది స్త్రీ జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. కానీ, ఈ మధుర క్షణాల వెనుక ఆ తల్లికి తెలియని ఒక పెద్ద సవాలు దాగి ఉంటుంది. డెలివరీ తర్వాత మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు శారీరకంగానే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. చాలా మంది మహిళలు తమకు తెలియకుండానే నిరాశ, ఆందోళన.. అంటే 'పోస్ట్ పార్టమ్ డిప్రెషన్'లోకి వెళ్లిపోతుంటారు. అకారణంగా కన్నీళ్లు రావడం, విపరీతమైన అలసట, అసహనం ఈ సమయంలో సహజం.
అయితే ఈ కష్టకాలం నుండి ఒక తల్లిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి మందుల కంటే 'మనుషులు' ఇచ్చే ధైర్యం ఎక్కువ పనిచేస్తుంది. ఫిన్లాండ్‌లోని హెల్సింకీ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ప్రసవం తర్వాత ఒక మహిళ తన తల్లిదండ్రులు, భర్త, అత్తమామలతో కలిసి ఉండటం వల్ల డిప్రెషన్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఈ పరిశోధన చెబుతోంది. కుటుంబ సభ్యుల మాటలు, వారు ఇచ్చే చిన్నపాటి సాయం ఆ తల్లిలో ఒంటరితనాన్ని పోగొట్టి, మానసిక బలాన్ని ఇస్తాయి.
అందుకే డెలివరీ తర్వాత మహిళకు కేవలం పౌష్టికాహారం అందిస్తే సరిపోదు.. ఆమెకు కుటుంబ మద్దతు అత్యంత అవసరం. బిడ్డ బాధ్యతలను పంచుకోవడం, ఆమెతో ప్రేమగా మాట్లాడటం, ఆమె భావాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆ తల్లి త్వరగా కోలుకుంటుంది. భార్యకు భర్త తోడుగా ఉండటం, అత్తమామలు సొంత బిడ్డలా ఆదరించడం అనేది ఒక మందులా పనిచేస్తుంది.