Caution on Weight-Loss Drugs: బరువు తగ్గించే మందుల వాడకంలో జాగ్రత్త.. చూపు కోల్పోయే ప్రమాదంపై హెచ్చరిక
ప్రమాదంపై హెచ్చరిక
Caution on Weight-Loss Drugs: బరువు తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో వంటి జీఎల్‌పీ-1 (GLP-1) ఔషధాలపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ మందులు వాడే వారిలో అరుదైన కంటి సమస్య వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. అకస్మాత్తుగా ఒక కంటిలో చూపు తగ్గడం, కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా చూపు కోల్పోవడం కూడా జరగవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఔషధాల తయారీ సంస్థలు తమ మందులపై కొత్త భద్రతా హెచ్చరికలు చేర్చాలని ఆదేశించింది.
ఎఫ్‌డీఏ హెచ్చరించిన కంటి సమస్య పేరు నాన్ ఆర్టెరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి (ఎన్ఏఐఓఎన్). కంటిలోని ఆప్టిక్ నర్వ్‌కు రక్తప్రసరణ తగ్గడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఆప్టిక్ నర్వ్ అనేది కంటికి కనిపించే సమాచారాన్ని మెదడుకు చేరవేసే కీలక నరం. ఈ మందులు ఎక్కువగా వాడడం వల్ల ఆ నరం దెబ్బతినే ప్రమాదం ఉందని ఎఫ్‌డీఏ పేర్కొంది. ముఖ్యంగా నిద్రలేచినప్పుడు ఒక కంటిలో చూపు తగ్గడం, మసకగా కనిపించడం, చూపులో కొన్ని భాగాలు కనిపించకపోవడం వంటివి జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో చూపు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది.
మధుమేహ నియంత్రణ, బరువు తగ్గింపులో ఈ ఔషధాలు ఫలితాలు ఇస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ మందులు వాడే ప్రతి లక్ష మందిలో దాదాపు ఆరుగురు ఈ అరుదైన కంటి సమస్యకు గురైనట్టు తేలింది. ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. సమస్య చాలా అరుదుగా నమోదవుతోంది. చూపులో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎన్ఏఐఓఎన్ నిర్ధారణ అయినవారు ఈ మందులను కొనసాగించాలా లేదా నిలిపివేయాలా అనే విషయాన్ని వైద్యులతో చర్చించాలి. అవసరమైతే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలని ఎఫ్‌డీఏ సూచించింది.