Cough Lasting More Than Three Weeks: మూడు వారాలకు మించి దగ్గు వేధిస్తుందా? ఈ లక్షణాలను అస్సలు విస్మరించొద్దు
అస్సలు విస్మరించొద్దు
Cough Lasting More Than Three Weeks: సాధారణంగా దగ్గు రావడం శరీరంలో ఒక సహజ ప్రక్రియ. శ్వాసనాళాల్లో చేరిన దుమ్ము, ధూళి, కఫం వంటి వ్యర్థాలను బయటకు పంపేందుకు దగ్గు సహకరిస్తుంది. జలుబు లేదా ఫ్లూ సోకినప్పుడు కొద్ది రోజులు దగ్గు రావడం సహజమే. అయితే దగ్గు మూడు వారాల కంటే ఎక్కువ కాలం వేధిస్తుంటే మాత్రం దానిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఉండే దగ్గు ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని చెబుతున్నారు.
దీర్ఘకాలిక దగ్గుకు ప్రధాన కారణాలు
జలుబు తగ్గిన తర్వాత కూడా శ్వాసకోశ వ్యవస్థ సున్నితంగా మారడం వల్ల కొద్దిరోజులు దగ్గు కొనసాగవచ్చు.
దుమ్ము, ధూళితో వచ్చే అలర్జీలు.
ఆస్తమా, శ్వాసనాళాల్లో వాపు
ధూమపానం అలవాటు ఉండటం.
గ్యాస్ట్రో ఈసోఫాగియల్ రిఫ్లక్స్ – కడుపులోని యాసిడ్ గొంతులోకి రావడం వల్ల గొంతు మంటతో పాటు దగ్గు వస్తుంది.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు లేదా క్షయ
డేంజర్ బెల్స్.. ఎప్పుడు అప్రమత్తం కావాలి?
దగ్గుతో పాటు కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
1. దగ్గుతూ ఉంటే రక్తం పడటం.
2. ఛాతీలో విపరీతమైన నొప్పి లేదా అసౌకర్యం.
3. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది
4. విడవకుండా జ్వరం రావడం, రాత్రి వేళల్లో అధికంగా చెమటలు పట్టడం.
5. ఆకలి మందగించడం మరియు ఎలాంటి కారణం లేకుండా వేగంగా బరువు తగ్గడం.
ముఖ్యంగా మూడు వారాలకు పైగా దగ్గు, కఫం, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే క్షయ వ్యాధి పరీక్షలు చేయించుకోవడం అత్యంత ఆవశ్యకం. టీబీ లక్షణాలు ప్రారంభంలో నెమ్మదిగా బయటపడతాయి కాబట్టి, సకాలంలో గుర్తిస్తే చికిత్స సులువవుతుంది, ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.
వైద్యులు చేసే పరీక్షలు - చికిత్స
మూడు వారాలకు మించి దగ్గు తగ్గకపోతే వైద్యులు రోగి దగ్గు తీవ్రత, ధూమపానం అలవాట్లు తదితర వివరాలను తెలుసుకుంటారు. అవసరాన్ని బట్టి కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్-రే , ఊపిరితిత్తుల పనితీరును అంచనా వేసే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్‌లు చేయిస్తారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా అసలు కారణాన్ని గుర్తించి సరైన చికిత్స అందిస్తారు. దగ్గును సాధారణ సమస్యగా భావించి సొంత వైద్యం చేసుకోకుండా, లక్షణాలు ముదిరేలోపే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.