Feeling Weak and Tired Due to Anemia: శరీరంలో రక్తహీనత ఏర్పడినప్పుడు తీవ్రమైన అలసట, నీరసం, తల తిరగడం, శ్వాస సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవడానికి ఐరన్, ఫోలేట్, విటమిన్లు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. దీని కోసం ఖరీదైన సప్లిమెంట్లపై ఆధారపడాల్సిన పనిలేదు. మన వంటింట్లో రోజూ వాడే సాధారణ కూరగాయలతోనే సహజసిద్ధంగా రక్తవృద్ధిని మెరుగుపరుచుకోవచ్చు.

హిమోగ్లోబిన్ పెంచే ఉత్తమ కూరగాయలు

పాలకూర, మెంతి ఆకులు: ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్ సమృద్ధిగా లభిస్తాయి. ఫోలేట్ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు వీటిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు.

బీట్‌రూట్: రక్తవృద్ధికి బీట్‌రూట్ ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఫోలేట్‌తో పాటు పలు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని సలాడ్స్, కూరలు లేదా సూప్ రూపంలో క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

బ్రోకలీ: బ్రోకలీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్ ‘సి’.. మొక్కల ద్వారా లభించే ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహించేలా చేస్తుంది.

పచ్చి బఠానీలు: శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో పచ్చి బఠానీలు కీలకం. వీటిని కూరలు లేదా పప్పుల్లో కలుపుకుని తీసుకోవడం ద్వారా సమతుల్య పోషణ అందుతుంది.

టమాటాలు: టమోటాల్లో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలోని ఐరన్‌ను శరీరం పూర్తిగా శోషించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. పాలకూర, బఠానీలు వంటి ఐరన్ రిచ్ పదార్థాలతో టమాటాలను కలిపి వండితే రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది.

సొరకాయ, చిలగడదుంప: సొరకాయలో నీటి శాతం, ఖనిజాలు పుష్కలంగా ఉండగా.. చిలగడదుంపలో ఫైబర్, విటమిన్లు మెండుగా ఉంటాయి. వీటిని సూప్‌లు లేదా ఉడకబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

నిపుణుల సూచన:

కూరగాయలతో పాటు పప్పుధాన్యాలు, శనగలు, చిక్కుళ్లు వంటి ప్రోటీన్, ఐరన్ నిండిన ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. కేవలం కూరగాయల ద్వారానే అన్ని రకాల రక్తహీనత సమస్యలు నయం కాకపోవచ్చు. హిమోగ్లోబిన్ స్థాయిలు మరీ తక్కువగా ఉంటే, సమస్య తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

Tags: