Cucumber: దోసకాయ: ఎవరికి మంచిది కాదు?.. నిపుణులు ఏమంటున్నారు..?
నిపుణులు ఏమంటున్నారు..?
Cucumber: శరీరాన్ని చల్లబరిచేందుకు, డీహైడ్రేషన్ ను నివారించేందుకు దోసకాయను అద్భుతమైన ఆహారంగా భావిస్తారు. ఇందులో 95% నీరు ఉండటమే కాక, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని సలాడ్లు, రైతా, లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం సర్వసాధారణం. బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇది ఒక వరంలాంటిదని చెబుతారు. ఈ అధిక పోషక విలువలున్న ఆహారం కొందరికి అపాయకరంగా మారే అవకాశం ఉందని, దీని వినియోగం కొన్ని ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దోసకాయ సహజంగా కూలింగ్ లక్షణాలను కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణం.
దోసకాయను ఎవరెవరు తీసుకోకూడదు..?
జలుబు-ఉబ్బసం (కఫం సమస్యలు): దోసకాయ శరీరంలో కఫాన్ని పెంచుతుంది. జలుబు, దగ్గు, కఫం, సైనస్ లేదా ముక్కు దిబ్బడ వంటి సమస్యలతో బాధపడేవారు దోసకాయ తినకుండా ఉండటం ఉత్తమం. ముఖ్యంగా చలికాలంలో దీని వినియోగం ఈ సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది.
కీళ్ల నొప్పి - వాపు: దోసకాయ యొక్క శీతలీకరణ స్వభావం వాత దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. ఇది ఇప్పటికే కీళ్ల నొప్పులు లేదా శరీరంలో వాపుతో బాధపడుతున్న వారి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే ప్రమాదం ఉంది.
సున్నితమైన జీర్ణవ్యవస్థ: దోసకాయలో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ, సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారికి ఇది ఇబ్బందిగా మారవచ్చు. ఇందులోని చేదు సమ్మేళనం అయిన కుకుర్బిటాసిన్ కారణంగా కొందరిలో గ్యాస్, ఉబ్బరం లేదా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
మూత్ర సమస్యలు: దోసకాయలో అధికంగా ఉండే నీటి శాతం మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. మూత్ర సమస్యలతో బాధపడేవారు లేదా రాత్రి సమయంలో నిద్రకు భంగం కలగకూడదనుకునే వారు దీన్ని పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది.
మధుమేహం - మందులు: డయాబెటిస్ ఉన్నవారికి దోసకాయ సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, ఇన్సులిన్ లేదా గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే మందులు తీసుకునేవారు దీని విషయంలో జాగ్రత్త వహించాలి. అధిక వినియోగం కొందరిలో రక్తంలో చక్కెర స్థాయిలను అతిగా తగ్గించి వణుకు, తలతిరుగుడు వంటి సమస్యలకు దారితీయవచ్చు.
ఎప్పుడు తినకూడదు?
ఆరోగ్య నిపుణులు సాధారణంగా భోజనం తర్వాత దోసకాయ తినకూడదని సలహా ఇస్తారు. దీనికి కారణం, దోసకాయ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతేకాక ఇందులో అధికంగా ఉండే నీటి శాతం కారణంగా రాత్రి వేళల్లో నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంది.