Carrot: క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కూరగాయలో అనేక పోషకాలు ఇమిడి ఉన్నాయి. ఇందులోని బీటా-కెరోటిన్, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అందుకే క్యారెట్‌ను ప్రతిరోజూ తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చని వివరిస్తున్నారు.

బరువు నియంత్రణ

క్యారెట్‌లో కేలరీలు తక్కువగా, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఈ కూరగాయలోని పీచుపదార్థాల కారణంగా కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. అందుకే క్యారెట్ తిన్న వారు తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఫలితంగా బరువు నియంత్రణ సాధ్యమవుతుంది. చలికాలంలో ముఖ్యంగా ఇది ఉపయోగకరం.

కంటి ఆరోగ్యం

క్యారెట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి విటమిన్ ఏ అందిస్తుంది. కళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు విటమిన్ ఏ చాలా అవసరం. ఇది లేకపోతే రేచీకటి ప్రమాదం వచ్చే అవకాశమూ ఉంది. ల్యూటిన్, జియాక్సంథిన్ వంటి పదార్థాలు వయసుతో వచ్చే కంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. అందుకే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్యారెట్ తినాలంటున్నారు ఆహార నిపుణులు.

చర్మ ఆరోగ్యం

బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. విటమిన్ ఏ కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ తీసుకుంటే చర్మం మెరిసేలా మారుతుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మెరుపును ఇస్తాయి.

మహిళలకు మరీ మంచిది

క్యారెట్లలో ఫాల్కరినాల్ వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మహిళలకు మేలు చేస్తాయని, వారి ఆరోగ్యాన్ని రక్షిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. పలు హార్మోన్ల సమస్యలను ఈ కూరగాయ దూరం చేస్తుందని వివరిస్తున్నాయి. పీసీఓడీ, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యల్లో ఉపశమనం ఇస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ

రోగనిరోధక వ్యవస్థ పనితీరును విటమిన్ ఏ మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్ పొందేందుకు క్యారెట్ ఉపయోగపడుతుంది. అంటే ఈ కూరగాయ రోగనిరోధక వ్యవస్థకూ మంచి చేస్తుందన్న మాట. వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది.

గుండె ఆరోగ్యం

పచ్చి క్యారెట్లు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు గుండెను రక్షిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుదల

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. పేగుల ఆరోగ్యానికి మంచిది. రోజూ తీసుకుంటే శరీరం సజావుగా పనిచేస్తుంది.

క్యాన్సర్ నివారణ

క్యారెట్లలో ఉండే పోషకాలు, ఫాల్కరినాల్ వంటి పదార్థాలు క్యాన్సర్ పెరుగుదలకు కారణమయ్యే కణాలను నిరోధిస్తాయి. పెద్దపేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి కొన్ని పచ్చి క్యారెట్లు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఎలా తినాలి?

క్యారెట్లను బాగా కడిగి సలాడ్ రూపంలో తింటే మంచిది. ఇందులో దోసకాయ, టమాటా, బీట్‌రూట్ కలుపుకోవచ్చు. క్యారెట్ జ్యూస్ కూడా తాగవచ్చు. అయితే జ్యూస్ కంటే సలాడ్ లాగా తింటేనే ఎక్కువ ఫైబర్ వస్తుంది. ఒకవేళ జ్యూస్ చేసుకుంటే వడగట్టకుండా తాగాలి. అప్పుడే పోషకాలన్నీ అందుతాయి. రోజుకు ఒకటి నుంచి రెండు క్యారెట్లు సరిపోతాయి.

మొత్తంగా రోజువారీ ఆహారంలో క్యారెట్‌ను చేర్చుకోవడం వల్ల కంటి చూపు నుంచి చర్మం, గుండె, రోగనిరోధక శక్తి వరకు అనేక విధాలుగా ఆరోగ్యం మెరుగవుతుంది. ఆహార నిపుణులు సలహా ప్రకారం నిరంతరం తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Tags: