Difficulty Breathing: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? ఈ హెచ్చరికలను గమనించండి..
ఈ హెచ్చరికలను గమనించండి..
Difficulty Breathing: నేటి కాలంలో కాలుష్యం, ఒత్తిడి మరియు మారుతున్న జీవనశైలి కారణంగా శ్వాసకోశ సమస్యలు సర్వసాధారణంగా మారాయి. కానీ, శ్వాస ఆడకపోవడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ప్రాణాంతక వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆయాసం రావడానికి ప్రధాన కారణాలు:
కేవలం పరుగెత్తినప్పుడు లేదా బరువులు మోసినప్పుడు మాత్రమే కాకుండా, సాధారణ స్థితిలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడానికి ఈ క్రింది అంశాలు కారణం కావచ్చు..
శారీరక అంశాలు: అధిక బరువు, శరీర బలహీనత వ్యాయామం లేకపోవడం.
పర్యావరణం: మితిమీరిన దుమ్ము, పొగ, కాలుష్యం మరియు వాతావరణ మార్పుల వల్ల వచ్చే అలర్జీలు.
మానసిక స్థితి: తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కూడా శ్వాస వేగాన్ని ప్రభావితం చేస్తాయి.
ఇది ఏయే వ్యాధులకు సంకేతం కావచ్చు?
నిరంతరాయంగా ఆయాసం రావడం అనేది కేవలం ఊపిరితిత్తులకే కాదు, ఇతర అవయవాల పనితీరులో లోపాలకు కూడా సూచిక కావచ్చు..
ఊపిరితిత్తుల సమస్యలు: ఆస్తమా, బ్రాంకైటిస్ లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు.
గుండె ఆరోగ్యం: గుండె వైఫల్యం లేదా గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం.
రక్తహీనత : శరీరంలో రక్తం తక్కువగా ఉంటే కణాలకు అందాల్సిన ఆక్సిజన్ అందక ఆయాసం వస్తుంది.
ఇతర కారణాలు: థైరాయిడ్ సమస్యలు లేదా తీవ్రమైన అలసట.
ముప్పు ఎవరికి ఎక్కువ?
వృద్ధులు, ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు.
కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారు.
శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ప్రాణాయామం & వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
పొగకు దూరం: ధూమపానం పూర్తిగా మానేయాలి.
మాస్క్ ధరించడం: కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో తిరిగేటప్పుడు మాస్క్ వాడటం ఉత్తమం.
వైద్య సహాయం: ఆయాసంతో పాటు ఛాతీ నొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
శ్వాస అనేది జీవనానికి ఆధారం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కేవలం అలసటగా భావించకుండా సకాలంలో స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ముప్పు నుంచి బయటపడవచ్చు.