Ultra-Processed Foods: అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే సంతానలేమి.. నిజమేనా.?

నిజమేనా.?

Update: 2026-03-25 08:36 GMT

Ultra-Processed Foods: మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని శాసిస్తుంది. కానీ నేటి వేగవంతమైన ప్రపంచంలో, మనం ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రుచికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ముఖ్యంగా పురుషుల్లో సంతానలేమి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం రోజూ తీసుకునే 'అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్' అని నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ యూనివర్సిటీ తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అసలు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి? చిప్స్, కూల్ డ్రింక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, నిల్వ ఉంచిన మాంసం.. ఇవన్నీ ఈ జాబితాలోకి వస్తాయి. ఎరాస్మస్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకునే పురుషులలో శుక్రకణాల నాణ్యత మరియు సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు తేలింది. ఇది కేవలం సామాన్య సమస్య కాదు.. ఇది ఒక తరానికి సంకేతం.

ఈ ఆహారాల్లో ఉండే అధిక చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతున్నాయి. వీటిని తయారు చేసేటప్పుడు వాడే రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు శరీరంలోని అంతస్రావిక వ్యవస్థను, దెబ్బతీస్తాయి. దీనివల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గి, సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది. మనం ప్యాకెట్ తెరవగానే వచ్చే రుచి వెనుక, ఇంతటి ప్రమాదం పొంచి ఉంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కేవలం బరువు పెరగడమే కాదు, అది నేరుగా మీ వంశాభివృద్ధిపైనే ప్రభావం చూపుతుందని ఈ స్టడీ హెచ్చరిస్తోంది. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోకుండా.. కేవలం ప్యాక్డ్ ఫుడ్స్‌పైనే ఆధారపడితే, భవిష్యత్తులో తండ్రి అయ్యే అవకాశాలను స్వయంగా చేజేతులా నాశనం చేసుకున్నట్లే. ఇది కేవలం నెదర్లాండ్స్ సమస్య కాదు.. మన దేశంలో కూడా ఈ ఆహారపు అలవాట్లు వేగంగా విస్తరిస్తున్నాయి.

Tags:    

Similar News