Ear Infection Risk Rises During Monsoon: వర్షాకాలంలో చెవి ఇన్ఫెక్షన్ల ముప్పు: నిర్లక్ష్యం చేస్తే వినికిడికే ప్రమాదం..
వినికిడికే ప్రమాదం..
Ear Infection Risk Rises During Monsoon: వర్షాకాలం చల్లదనాన్ని తెచ్చినా.. పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సాధారణంగా ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, జ్వరాలపై దృష్టి పెడతాం కానీ, చెవి సమస్యలను పెద్దగా పట్టించుకోం. అయితే వాతావరణంలో తేమ పెరగడం వల్ల వర్షాకాలంలో చెవి ఇన్ఫెక్షన్లు వేగంగా పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయి?
గాలిలో ఉండే అధిక తేమ, వర్షపు నీరు లేదా స్నానం చేసేటప్పుడు చేరే నీరు ఎక్కువసేపు చెవిలోనే ఉండిపోవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి."లోపలి చెవి చాలా సున్నితమైన భాగం. వర్షంలో తడవడం, ఈత కొట్టడం, తడి ఇయర్‌ఫోన్లు వాడటం వల్ల చెవిలో చేరిన నీరు బయటకు రాకపోతే ఇన్ఫెక్షన్ ప్రమాదం తీవ్రమవుతుంది. అలాగే సైనస్, అలర్జీలు లేదా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువ." అని డాక్టర్లు చెబుతున్నారు.
కనిపించే ప్రధాన లక్షణాలు
నిరంతరంగా చెవి నొప్పి, తీవ్రమైన దురద
చెవి నుంచి నీరు లేదా పసుపు రంగు ద్రవం కారడం
చెవి మూసుకుపోయినట్లు అనిపించడం, వినికిడి తగ్గడం
చెవి లోపల వాపు రావడం
చిన్న పిల్లల్లో విపరీతమైన చిరాకు, తరచూ చెవిలో వేళ్లు పెట్టుకోవడం
ఈ లక్షణాలు రెండు మూడు రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే వెంటనే ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించాలి.
ప్రతి నొప్పి ఇన్ఫెక్షనేనా?
ప్రతి చెవి నొప్పి ఇన్ఫెక్షన్ వల్లనే రావాలని లేదు. చెవిలో గులిమి పేరుకుపోవడం, గొంతు ఇన్ఫెక్షన్లు, సైనస్ లేదా దవడ నొప్పుల వల్ల కూడా చెవి నొప్పి రావచ్చు. అందుకే సొంత వైద్యం చేసుకోకుండా నిపుణుల చేత పరీక్ష చేయించుకోవడం అవసరం.
చేయకూడని తప్పులు
పిన్నులు, అగ్గిపుల్లలు, బడ్స్ లేదా పదునైన వస్తువులను చెవిలో పెట్టకూడదు.
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల నుంచి ఇయర్ డ్రాప్స్ వాడకూడదు.
బామ్మ చిట్కాలంటూ చెవిలో నూనెలు, ఆకుల రసాలు వేయకూడదు.
చెవిని పదేపదే గోకడం మానుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షంలో తడిచిన వెంటనే చెవులను పొడి గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి.
స్నానం లేదా ఈత తర్వాత చెవుల్లో నీరు లేకుండా చూసుకోవాలి.
తడిగా లేదా మురికిగా ఉన్న ఇయర్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్ వాడటం మానేయాలి.
చెవిని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.