Earwax Isn’t Dirt: చెవిలో గులిమి మురికి కాదు.. సహజ రక్షణ కవచం.. ఇయర్‌బడ్స్‌తో ఈ ప్రమాదాలు తప్పవు
ఈ ప్రమాదాలు తప్పవు
Earwax Isn’t Dirt: రోజూ స్నానం చేయగానే చాలామందికి చెవుల్లో దూది పుల్లలు, హెయిర్‌పిన్‌లు లేదా తాళంచెవులతో తిప్పడం ఒక అలవాటుగా మారిపోయింది. చెవిలో కనిపించే గులిమిని మురికిగా భావించి, దానిని తరచుగా తొలగించాలని అనుకోవడమే ఇందుకు కారణం. అయితే వైద్య నిపుణుల ప్రకారం చెవి గులిమి మురికి కాదని, అది కర్ణభేరిని కాపాడే అద్భుతమైన సహజ రక్షణ కవచమని స్పష్టం చేస్తున్నారు. దాన్ని బలవంతంగా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
చెవి గులిమి ఎందుకు ముఖ్యం?
వైద్య పరిభాషలో చెవి గులిమిని సెరుమెన్ అంటారు. ఇది చెవి నాళంలోని ప్రత్యేక గ్రంధుల ద్వారా సహజంగా ఉత్పత్తి అవుతుంది. బయట నుంచి వచ్చే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, ఫంగస్ మాత్రమే కాకుండా చిన్న చిన్న కీటకాలు కర్ణభేరి వరకు చేరకుండా ఇది అడ్డుకట్ట వేస్తుంది. చెవి నాళం పొడిబారి దురద, పగుళ్లు రాకుండా సహజ నూనెలా తేమను అందిస్తుంది. సాధారణంగా మాట్లాడేటప్పుడు, ఆహారాన్ని నమిలేటప్పుడు దవడ కదలికల ద్వారా పాత గులిమి క్రమంగా చెవి బయటకు వచ్చేస్తుంది. చెవికి దానంతట అదే శుభ్రపడే అద్భుతమైన వ్యవస్థ ఉంటుంది.
ఇయర్‌బడ్స్ వాడితే జరిగే నష్టాలివే
దూది పుల్లలు లేదా పదునైన వస్తువులను చెవిలో పెట్టినప్పుడు జరిగేది శుభ్రం కావడం కాదు, సమస్యను మరింత పెద్దది చేయడమే.
గులిమి లోపలికి నెట్టబడటం: ఇయర్‌బడ్స్ వాడినప్పుడు గులిమి బయటకు రాకపోగా, మరింత లోపలికి నెట్టబడి గట్టిపడిపోతుం.
కర్ణభేరి పగిలే ముప్పు: అనుకోకుండా లేదా తొందరపాటుతో బడ్‌ను లోపలికి గుచ్చితే పల్చని కర్ణభేరి దెబ్బతిని శాశ్వత వినికిడి సమస్యలు రావచ్చు.
ఇతర సమస్యలు: చెవి నొప్పి, చెవి మూసుకుపోయిన భావన, నిరంతరం రింగుమనే శబ్దం రావడం , ఇన్ఫెక్షన్లు మరియు తీవ్రమైన తలతిరగడం వంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి.
చెవులను ఎలా సంరక్షించుకోవాలి?
ఇయర్‌బడ్స్‌కు గుడ్‌బై చెప్పండి: చెవి లోపలికి ఎలాంటి ఇయర్‌బడ్స్, పిన్నులు, దూది పుల్లలు పెట్టకూడదు.
బయటి భాగం మాత్రమే: స్నానం చేసిన తర్వాత మృదువైన, తడి గుడ్డతో చెవి బయటి మడతలను మాత్రమే మెల్లగా తుడుచుకోవాలి.
డ్రాప్స్ వాడేటప్పుడు జాగ్రత్త: సొంత వైద్యంతో నూనెలు లేదా ఏవో ఒక డ్రాప్స్ వేయకూడదు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
చెవి నొప్పి రావడం, వినికిడి తగ్గడం, చెవిలోంచి చీము లేదా నీరు కారడం, విపరీతమైన దురద లేదా దిబ్బడ వేసినట్లు అనిపిస్తే సొంత ప్రయోగాలు చేయకుండా వెంటనే ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించాలి. అవసరమైతే వైద్యులే ప్రత్యేకమైన పరికరాలతో సురక్షితంగా పేరుకుపోయిన గులిమిని తొలగిస్తారు.