Eggs vs Paneer: గుడ్లు vs పన్నీర్: ప్రొటీన్ కోసం ఏది ఉత్తమం?
ప్రొటీన్ కోసం ఏది ఉత్తమం?;
Eggs vs Paneer: శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ప్రొటీన్ ఒకటి. శరీర నిర్మాణం, కండరాల పెరుగుదలకు ప్రొటీన్లు చాలా అవసరం. మన ఆహారంలో సరైన ప్రొటీన్ వనరును ఎంచుకోవడం మన ఆరోగ్యానికి కీలకం. పన్నీర్, గుడ్డు రెండింటిలోనూ అధిక మొత్తంలో ప్రొటీన్లు లభిస్తాయి. అయితే, వీటిలో ఏది ఉత్తమమైనది అనేది ఇప్పుడు చూద్దాం.
పన్నీర్ ప్రయోజనాలు
100 గ్రాముల పన్నీర్‌లో దాదాపు 18 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. పనీర్ లేదా కాటేజ్ చీజ్ శాకాహారులకు అత్యంత ఇష్టమైన ఆహారం. ఇందులో ప్రొటీన్‌తో పాటు కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పనీర్‌లో ఉండే కేసైన్ ప్రొటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది కండరాల పునరుద్ధరణ, పెరుగుదలకు చాలా మంచిది. అయితే, పన్నీర్‌లో కొవ్వు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియంకు మంచి వనరు.
గుడ్డు ప్రయోజనాలు
100 గ్రాముల ఉడికించిన గుడ్డులో దాదాపు 13 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. గుడ్లలో శరీరానికి అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సరైన నిష్పత్తిలో ఉంటాయి. తక్కువ కొవ్వు, కేలరీలతో ప్రొటీన్ కావాలనుకునే వారికి ఉడికించిన గుడ్లు ఉత్తమమైనవి. ఇందులో విటమిన్ డి, విటమిన్ బి12, సెలీనియం, కోలిన్ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి, జీవక్రియకు తోడ్పడతాయి. గుడ్ల నుండి శరీరం ప్రొటీన్‌ను సులభంగా జీర్ణం చేసుకోగలదు.
గుడ్డుతో చేసే ఆమ్లెట్
100 గ్రాముల ఆమ్లెట్‌లో దాదాపు 11 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. గుడ్లకు కూరగాయలు, మసాలా దినుసులు వంటివి కలిపి ఆమ్లెట్‌ను తయారు చేస్తారు. దీని ప్రొటీన్ కంటెంట్ తయారీ విధానాన్ని బట్టి మారుతుంది. ఆమ్లెట్ పోషక విలువను పెంచడానికి కూరగాయలు లేదా లీన్ మాంసాన్ని చేర్చుకోవచ్చు. ఉడికించిన గుడ్లతో పోలిస్తే ఆమ్లెట్‌లలో కొవ్వు పదార్థం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, పోషకాహార ప్రొఫైల్ దాదాపుగా అలాగే ఉంటుంది.
ఏది ఉత్తమం?
పన్నీర్, గుడ్డు రెండూ వాటి వాటి ప్రయోజనాలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం, గుడ్లు ఉత్తమమైనవి. ఎందుకంటే వాటిని "గోల్డ్ స్టాండర్డ్" ప్రొటీన్‌గా పరిగణిస్తారు. గుడ్లలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సరైన నిష్పత్తిలో ఉంటాయి. పన్నీర్‌లో ప్రొటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ, గుడ్లలో ఉండే కొన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఇందులో తక్కువగా ఉంటాయి. అలాగే, గుడ్లలోని ప్రొటీన్‌ను శరీరం సులభంగా జీర్ణం చేసుకోగలదు. అందుకే, ప్రొటీన్ కోసం గుడ్లను ఉత్తమ ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.