Feeling Dizzy Again and Again: అకస్మాత్తుగా లేచి నిలబడినప్పుడు లేదా ఎక్కువసేపు ఎండలో ఉన్నప్పుడు తల తిరగడం సాధారణమే. అయితే ఎలాంటి కారణం లేకుండా మాటిమాటికీ కళ్లు తిరగడం, తల బరువుగా అనిపించడం లేదా శరీరం సమతుల్యత కోల్పోవడం వంటి సమస్యలు ఎదురైతే దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది శరీరంలో దాగి ఉన్న ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల తిరగడానికి దారితీసే 5 ప్రధాన కారణాలు గురించి తెలుసుకుందాం..

రక్తపోటులో హెచ్చుతగ్గులు

రక్తపోటు ఆకస్మికంగా పడిపోయినప్పుడు మెదడుకు చేరే రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల కళ్లు చీకట్లు కమ్మడం, తల తిరగడం జరుగుతుంది. అలాగే రక్తపోటు తీవ్రంగా పెరిగినప్పుడు కూడా నరాలపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య వస్తుంది.

వర్టిగో - అంతర్గత చెవి సమస్యలు

శరీర సమతుల్యతను కాపాడటంలో చెవి లోపలి భాగం కీలక పాత్ర పోషిస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్ రావడం లేదా లోపలి భాగంలోని ఫ్లూయిడ్స్‌లో అసమతుల్యత ఏర్పడినప్పుడు 'వర్టిగో' సమస్య తలెత్తుతుంది. దీనివల్ల చుట్టూ ఉన్న పరిసరాలు గిర్రున తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.

రక్తహీనత

శరీరంలో ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. దీనివల్ల శరీర కణాలకు, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా తీవ్ర అలసట, బలహీనతతో పాటు నిరంతరం తల తిరుగుతున్న భావన కలుగుతుంది.

తక్కువ బ్లడ్ షుగర్ లెవల్స్

డయాబెటిస్ ఉన్నవారిలో లేదా సమయానికి భోజనం చేయని వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పడిపోతుంటాయి. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, చేతులు వణకడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డీహైడ్రేషన్ - పోషకాల లోపం

శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల రక్త పరిమాణం తగ్గిపోతుంది. దీనితో పాటు విటమిన్ B12 లోపం ఉన్నా కూడా నాడీ వ్యవస్థ దెబ్బతిని తలతిరుగుడు సమస్య వస్తుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

తల తిరగడంతో పాటు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

ఒకవైపు చేయి లేదా కాలు మొద్దుబారడం.

చూపు మసకబారడం లేదా మాట్లాడటంలో తడబాటు రావడం.

విపరీతమైన ఛాతీ నొప్పి, గుండె దడ లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

అపస్మారక స్థితికి చేరుకోవడం.

Tags: